కరీంనగర్, మార్చి 26,
పెద్దపల్లి జిల్లాలోని ఓ బ్యాంకులో సినిమా రేంజ్‌లో దొంగలు రెచ్చిపోయారు. పక్కా ప్రణాళికతో బ్యాంకుకు కన్నమేసి సొత్తులు కాజేశారు. పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదును దోచుకుపోయారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో బుధవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. ఇందులో మొత్తం రూ.3.1 కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.బ్యాంకు వెనుక ఉన్న కిటికీలను తొలగించి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకు సెక్యూరిటీ వ్యవస్థ గురించి ముందే తెలుసుకున్న దొంగలు అలారం మోగకుండా ఉండేందుకు ముందుగానే బ్యాటరీ కనెక్షన్‌ను వేరు చేశారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో భారీ లాకర్ తలుపును కట్ చేశారు. అందులోని రూ.18.46 లక్షల నగదుతో పాటు రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సైతం బయటపడకుండా సీసీటీవీ ఫుటేజీ డీవీఆర్ బాక్స్‌ను సైతం వారు వెంట తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.బ్యాంక్ దొంగతనంలో వారు ప్రొఫెషనల్ మ్యానర్‌లో ఏలాంటి ఆధారాలు దొరకకుండా దొంగతనం చేశారని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసును సవాలుగా తీసుకున్నామని నిందితులకోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఇంతవరకు ఇలాంటి దొంగతనం జరగలేదని తెలిపారు