YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శుభ్రతవైపు ముందడుగు

శుభ్రతవైపు ముందడుగు

నగరంలో నుంచి వెళుతున్న సాగు, తాగునీటి కాలువల్లో కాలుష్యం నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై నగరపాలక సంస్థ దృష్టి పెట్టింది. కాలువ గట్ల ఆక్రమణల తేనెతుట్టను కదపడం ఇష్టం లేని యంత్రాంగం రూ.కోట్లు వెచ్చించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఓ వైపు కాల్వల సుందరీకరణ అని సీఎం చెబుతుండగా, వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఆక్రమణల జోలికి వెళ్లవద్దని స్థానిక నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కాలువలకు వదిలే మురుగునీరును దారి మళ్లించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దీంతో రూ.కోటి వెచ్చించి సమాంతర పైపు లైను ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. మూడు ప్రధాన కాలువలకు పైపులైను ఏర్పాటు చేసి వాటిని ఎస్‌టీపీ (మురుగునీటి శుద్ధి ప్లాంట్‌)లకు అనుసంధానం చేయాలని భావిస్తోంది. కాలువ గట్లపై దాదాపు 15 మీటర్ల వెడల్పుతో రహదారి ఉండాలి. కానీ ఈ రహదారి మూసుకుపోయింది. బందరు రహదారి కాలువ గట్టుపై కరకట్ట రహదారి ఉంది. దీనికి ఇరువైపులా మాత్రమే కాదు... కాలువలోనూ దిగువ వరకు నిర్మాణాలు చేశారు. కేవలం నివాసం మాత్రమే కాకుండా ఇక్కడ వాణిజ్య దుకాణాలు నిర్వహించడం విశేషం. కాలువ గట్లపై చేసిన నిర్మాణాలను ప్రస్తుతం ఆయా ప్రాంతాలను బట్టి రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు డిమాండ్‌ ఉంది. కొంతమంది కొనుగోలు చేసుకుంటున్నారు. తూర్పు, మధ్య , పెనమలూరు, గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఈ కాలువ గట్ల ఆక్రమణలు ఉన్నాయి.

 ఈ అక్రమణల నివాసాల నుంచి మురుగునీరు, మల, మూత్రశాలలు నుంచి వెలువడే మురుగును నేరుగా కాలువలో కలిపేస్తున్నారు. ఇదే కాలువలు దిగువన 383 చెరువల్లో నీరు నింపి తాగునీటిగా అందిస్తున్నారు. ఈ చెరువుల్లో నీరు ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నుంచి గ్రామాలకు వెళుతుంది. వాటికి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఉండాల్సి ఉంది. కానీ అవి పనిచేయడం లేదు. కేవలం క్లోరినేషన్‌ ద్వారా శుద్ధి చేసి పంపిస్తున్నారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం మురుగు కలువ కుండా నియంత్రించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థదేనని స్పష్టం చేశారు.

విజయవాడలో సుందరీకరణ వ్యవహారంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ప్రత్యేంకగా సమీక్షించారు. కాలువల గట్లను ఆక్రమణలు తొలగించి పచ్చదనం పెంచి బోటింగ్‌ ఏర్పాటు చేయాలనేది ప్రధాన ఆలోచన. దీనికి పర్యాటక శాఖ కూడా ముందుకు వచ్చి ఇటీవల ఒక బోటును ప్రారంభించింది. కానీ ఆక్రమణల తేనె తుట్టను కదిలించే ప్రయత్నం అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు కానీ చేయడం లేదు.

Related Posts