YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అన్నీ మట్టి మాటలే...

అన్నీ మట్టి మాటలే...

గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు సగానికి సగం మిగుల్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లా పాలనాధికారి ఆదేశాలు ఇచ్చారంటూ.. టెండర్ల నిబంధనలను తుంగలో తొక్కారు. 18 కిలో మీటర్ల దూరం నుంచి తీసుకురావాల్సిన మట్టిని కేవలం ఏడు కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి సగానికి సగం మిగుల్చుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉంది. నేతల అండదండలతో రూ.కోట్లు దిగమింగుతున్నారు.

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం అదనంగా రన్‌వే టెర్మినల్‌ నిర్మిస్తున్నారు. పాత టెర్మినల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరిస్తున్నారు. అదనపు టెర్మినల్‌ కోసం గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో భూసేకరణ జరిగింది. బుద్దవరానికి చెందిన రాజీవ్‌నగర్‌ కాలనీ, సుబ్బారావునగర్‌ కాలనీ ఖాళీ చేయించాల్సి వస్తోంది. రాజీవ్‌నగర్‌ కాలనీలో 84 నివాసాలు, సుబ్బారావునగర్‌ కాలనీలో 13 నివాసాలు ఖాళీ చేయాల్సి ఉంది. ఈ కుటుంబాలు నిరాశ్రయులుగా మారుతున్నాయి. వీరికి పునరావాసం ఏర్పాటు చేయాల్సి ఉంది. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో చినఆవుటపల్లిలో 49.36 ఎకరాలు భూసేకరణ చేశారు. దీనిలో 2.20 ఎకరాలు మినహా మిగిలినది భూసమీకరణ కింద తీసుకున్నారు. వీరికి పునరావాస కాలనీ నివేశన స్థలాలు ఇవ్వాల్సి ఉంది.

భూసమీకరణ కింద నిబంధనల ప్రకారం నివేశన స్థలాలు సమీపంలో ఇవ్వాల్సి ఉంది. గన్నవరం మండలం చిన్నఆవుటపల్లి గ్రామం సమీపంలో ఆర్‌అండ్‌ఆర్‌ కింద పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 50 ఎకరాల్లో 520 ఇళ్లను నిర్మాణం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ పనులను ఏపీ టిడ్కోకు అప్పగించారు. ముందు పునరావాస కాలనీ నిర్మాణం చేసే స్థలాన్ని చదును చేయాలని నిర్ణయించారు. ఈపనులను రహదారుల భవనాల శాఖకు అప్పగించారు. దీనికి ప్రాథమికంగా అంచనాలు తయారు చేశారు. 50 ఎకరాల్లో ఉన్న స్థలాన్ని చదును చేసేందుకు అదనంగా మట్టి నింపాల్సి వస్తుందని అంచనా వేశారు. ప్రాథమికంగా రూ.8కోట్లు అంచనా వ్యయం వేసి మంజూరు చేశారు.

ఈ పునరావాస కాలనీ స్థలాన్ని చదును చేసేందుకు  రోడ్లు, భవనాల శాఖ టెండర్లను పిలిచింది. అంచనా వ్యయం సుమారు రూ.8 కోట్లు కాగా.. 1.90లక్షల ఘనపు మీటర్ల మట్టిని నింపాల్సి ఉందని టెండర్‌లో పేర్కొంది. ఒక నిర్మాణ సంస్థ సుమారు 4.5శాతం అధిక ధరలకు టెండర్‌ దక్కించుకుంది. ఇక్కడ కాంట్రాక్టర్లు రింగుగా మాకి పోటీ లేకుండా టెండరు దక్కించుకున్నారు. ఒక్క ఘనపు మీటరు మట్టికి సుమారు రూ.400 వరకు ధర కోట్‌ చేసినట్లు సమాచారం. అయితే అంచనాల్లో మాత్రం దీనికి బ్రహ్మలింగం చెరువు కేటాయించారు. అక్కడి చెరువులో మట్టి తవ్వి దాన్ని తీసుకురావాల్సి ఉంది. ఇది నిర్మాణ ప్రాంతం పునరావాస కాలనీకి 18 కిలోమీటర్ల దూరం ఉంది. టెండర్‌ నిబంధనల ప్రకారం అక్కడి నుంచి తీసుకురావాల్సి ఉంది. ఇక్కడి నుంచి మట్టిని తీసుకువస్తే ఒక టిప్పర్‌కు రూ.2వేల వరకు వ్యయం అవుతున్నట్లు తెలిసింది. ఒక టిప్పర్‌లో దాదాపు 10 నుంచి 15 ఘనపు మీటర్ల మట్టి తరలిస్తారు. ఇక్కడి నుంచి ధర ఎక్కువగా ఉండటంతో ఆత్కూర్‌ ప్రాంతం నుంచి మట్టి తరలిస్తున్నారు.

గత పది రోజులుగా టిప్పర్‌లు ఆత్కూర్‌ నుంచి తిరుగుతున్నాయి. ఇది కేవలం 7 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇక్కడొక చెరువు, ప్రభుత్వ భూమి నుంచి మట్టి తవ్వకాలు చేస్తున్నారు. కానీ దీనికి అనుమతి లేదు. దీని వల్ల టిప్పర్‌కు కేవలం రూ.800 నుంచి రూ.వెయ్యి మాత్రమే ఖర్చు అవుతున్నాయి. సగానికి సగం మిగులుతున్నాయి. అక్కడ మట్టి తవ్వినందుకు టిప్పర్‌కు రూ.300 చెల్లిస్తున్నారని తెలిసింది. కొంతమంది గ్రామ అభివృద్ధి కోసం వీటిని వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇక్కడ మట్టి తవ్వకాలపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయగా జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. ప్రజాప్రయోజనం నిమిత్తం తరలిస్తున్నారని అభ్యంతరం చెప్పవద్దని కలెక్టర్‌ సూచించారని ఉంగుటూరు తహసీల్దార్‌ చెబుతున్నారు. దీంతో గుత్తేదారుకు అడ్డులేకుండా పోయింది. ఒకేసారి లీడ్‌లో 11 కిలోమీటర్లు తగ్గడంతో మట్ట పనుల్లో భారీగా మిగులుతున్నట్లు అంచనా. పునరావాస కాలనీ చదునులోనూ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి అక్కడ చదును చేస్తే కొంతమట్టి వస్తుంది. దీన్ని లెక్కల్లో చూపిస్తున్నారని తెలిసింది. మొత్తం రూ.8కోట్లలో దాదాపు సగానికి సగం మింగేస్తున్నారు..

Related Posts