YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

మిల్లర్ల మాయ

మిల్లర్ల మాయ

నెల్లూరు, ఏప్రిల్ 26 (న్యూస్ పల్స్): రైస్‌ మిల్లర్ల మాఫియాతో రైతు సతమతం అవుతున్నాడు. రైతులను ఆదుకోటానికి ప్రభుత్వం ఇస్తున్న లబ్ధిని కూడా మిల్లర్లు బొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలులో గోల్‌మాల్‌ చేస్తున్నారు. దళారులే రాయబారులు. రైతు పేరిట ఉన్న ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లి.. అందులో కూడా కల్తీ చేసి రెండు వైపులా దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మేలుకోవటం లేదు. అక్రమాలు ఆగటం లేదు. వెరసి జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవహారం అదుపులోకి రావటం లేదు. కొనుగోలు కేంద్రాలతో సంబంధం లేకుండానే లారీలు మిల్లుకు వస్తున్నాయి. మిల్లుకు వచ్చిన తర్వాత ట్రక్‌ షీట్‌ను గ్రామ కార్యదర్శులు ఇస్తున్నారు. ఇలా ధాన్యం కొనుగోలు వ్యవహారంలో భారీ గోల్‌మాల్‌ చేసే విధంగా మిల్లర్లు ప్రణాళికను తయారు చేసుకున్నారు. రైతు శ్రమతో రూ.కోట్ల మొత్తాన్ని దోచుకోటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సీఎంఆర్‌ కింద సేకరించే ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకం ధాన్యం కూడా బీపీటీ మాదిరే మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం పుట్టి  రూ.13,515 వంతున చెల్లించే పరిస్థితి నెలకొంది. సాధారణ రకం ధాన్యానికి    రూ.13,175 వంతున చెల్లించాలని నిర్ణయించారు. జిల్లాలో పండే ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకం ధాన్యాన్ని సాధారణ రకంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీనివల్ల పుట్టికి రూ.340 వంతున తేడా వస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించి.. రైతులకు చెల్లించాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం రూ.13,175 వంతున మాత్రమే ధర చెల్లించాల్సి ఉంది. బీపీటీ పండించే రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగాయని.. ప్రభుత్వం బోనస్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్వింటాలుకు రూ.210 వంతున రైతుకు చెల్లించాలని నిర్ణయించారు. ఇది కూడా రైతుకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, మిల్లర్లు తమ జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేయటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా సుమారు 22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఇంకా సుమారు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నెలాఖరులోగా రానుంది. ఈ మొత్తం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీన్ని ఎలా నిర్వహిస్తారనే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

సీఎంఆర్‌ కింద తీసుకునే ధాన్యాన్ని మిల్లుల్లో కల్తీ చేసేస్తున్నారు. 70 శాతం బీపీటీ ధాన్యం ఉంటే.. అందులో 30 శాతం వరకు 34449 రకాన్ని కల్తీ చేస్తున్నారు. ప్రభుత్వానికి చూపే లెక్కల్లో మాత్రం అంతా బీపీటీ కింద లెక్క తేలుస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ప్రకటించే బోనస్‌ మొత్తం, 34449 రకం ధాన్యానికి ప్రభుత్వం తరఫున ఎ గ్రేడ్‌ రకం ధాన్యం కింద ఇచ్చే లబ్ది కూడా మిల్లర్లకే దక్కనుంది. పౌరసరఫరాల సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 30 శాతం వంతున 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 34449 రకాన్ని కల్తీ చేశారని భావించినా.. బోనస్‌ రూపేణా ప్రభుత్వం క్వింటాలుకు రూ.210 వంతున చెల్లిస్తుంది. అంటే టన్నుకు రూ.2,100 మొత్తం చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలో కల్తీ చేసినట్లు భావిస్తున్న 30 వేల మెట్రిక్‌ టన్నులకు రూ.6.30 కోట్ల మొత్తం మిల్లర్లకే లబ్ధి చేకూరనుంది. రైతుల నుంచి తీసుకునే సమయంలో 34449 రకం చూపినా.. మిల్లరు దగ్గరకు వచ్చేప్పటికి బీపీటీగా లెక్కల్లో గోల్‌మాల్‌ చేస్తున్నారు. ఇలాగే ట్రక్‌ షీట్‌ వచ్చే విధంగా భారీ ఎత్తున వ్యవహారం నడుస్తోంది. ఇలా చేయటం ద్వారా మిల్లర్లు భారీ మొత్తంలో లబ్ది పొందే ప్రణాళికను రూపొందించారు. ఎలాగా సీఎంఆర్‌ ధాన్యం తీసుకోటానికి బ్యాంకు హామీలతో కట్టుదిట్టం చేయటంతో ప్రత్యామ్నాయంగా ఇలాంటి మార్గాన్ని మిల్లుల నిర్వాహకులు ఎంచుకున్నారు. ఎలా లేదన్నా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేప్పటికి రూ.15 కోట్ల వరకు దోపిడీ జరుగుతుందని అంచనా.

బీపీటీ ధాన్యంలో ఎక్కువగా విరుగుళ్లు వస్తున్నాయని.. దీని వల్ల బీపీటీ ధాన్యంలో విరుగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటే వాటిని బాయిల్డ్‌ బియ్యంగా మార్చాలని అధికారులు చెప్పారు. దీన్ని అవకాశంగా మిల్లర్లు చేసుకున్నారు. బాయిల్డ్‌ చేస్తే ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకానికి, బీపీటీకి తేడా గమనించే పరిస్థితి ఉండదు. దీన్ని అవకాశంగా చేసుకుని మిల్లర్లు విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం రైతును దృష్టిలో ఉంచుకుని ఇచ్చే బోనస్‌ మొత్తం మిల్లర్ల జేబుల్లోకి వెళ్లనుంది. నిబంధన ప్రకారం రైతు నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి.. అక్కడ తేమ శాతం పరీక్షించిన తర్వాత ట్యాగ్‌ చేసిన మిల్లులకు పంపాల్సి ఉంది. కానీ, జిల్లాలో మాత్రం కొనుగోలు కేంద్రాలకే ధాన్యం రావటం లేదు. నేరుగా రైతు పొలాల నుంచి మిల్లులకు తరలిపోతోంది. ఇలా చేయటం వల్ల అసలు ధాన్యం నాణ్యత గురించి తెలుసుకునే పరిస్థితి లేదు. మిల్లర్లు ఎంతగా కల్తీ చేసినా కనిపెట్టే పరిస్థితి లేదు.

Related Posts