YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నుడాపై నిర్లక్ష్యం

నుడాపై నిర్లక్ష్యం

నిజామాబాద్, ఏప్రిల్ 26 (న్యూస్ పల్స్): నిజామాబాద్‌ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నుడా) గత ఏడాది అక్టోబరు 24న అవతరించింది. ఐదు నెలలు కావస్తున్నా నుడా విధివిధానాలు ఖరారు కాలేదు. కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో లేఅవుట్‌, భవన నిర్మాణాల అనుమతులు మంజూరు డోలాయమానంలో పడింది. నుడా ఏర్పాటుతో అనుమతుల జారీ ప్రక్రియ తమ పరిధిలోకి రాదని డీటీసీపీ అధికారులు పేర్కొంటున్నారు. నుడాలో విలీనమైన గ్రామాలకు సంబంధించి పంచాయతీలు ఇదే మాట చెబుతున్నాయి. నుడాకు ఛైర్మన్‌గా వ్యవహరించే జిల్లా కలెక్టరు, డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించే  నగర పాలక సంస్థ కమిషనరు ప్రభుత్వం ఈ అంశంపై జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.

నుడా ఏర్పడి ఐదు నెలల గడిచినా కార్యాచరణ మొదలు కాకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిజామాబాద్‌ నగర పాలక సంస్థ శివారులోని 60 గ్రామాలు నుడాలోకి విలీనం చేసి నుడాను ప్రకటించారు. నగర పాలక సంస్థ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో లేఅవుట్లు, భవనాల అనుమతులకు సమస్య ఉత్పన్నం కావడం లేదు. వీటికి అనుమతులను నగర పాలక సంస్థ జారీ చేస్తోంది. విలీన గ్రామాల్లో అనుమతులకు మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నుడా అధికారులను నియమించి, కార్యాలయాన్ని ఏర్పాటు చేసేంతవరకూ అనుమతుల దరఖాస్తులన్నీ పెండింగులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తమకు అనుమతులు జారీ చేసే అధికారం లేదని డీటీసీపీ అధికారి జలంధర్‌రెడ్డి పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించే అంశం ప్రభుత్వం పరిధిలో ఉందని ఆయన పేర్కొన్నారు. నుడా ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో వేములవాడ పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పాటైంది. లేఅవుట్ల అనుమతుల జారీ విషయంలో సమస్య ఉత్పన్నం కాగా ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించింది. విధివిధానాలు, కార్యాలయం ఏర్పాటయ్యే వరకూ నిర్ధారిత రుసుం వసూలు చేసి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా డీటీసీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే తరహాలో నుడా విషయంలో ఆదేశాలు జారీ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. స్థిరాస్తి వ్యాపారులు పలువురు రాజధానికి వెళ్లి ఈ అంశంపై చొరవ చూపి సమస్య పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించినా స్పందనలేదు.

నిజామాబాద్‌ నగర శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా నుడాలో విలీనమైన పాంగ్రా, బోర్గాం, మాణిక్‌భండార్‌, గూపన్‌పల్లి, సారంగాపూర్‌, కాలూరు, ఖానాపూర్‌, గుండారం శివారు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేఅవుట్లు వెలుస్తున్నాయి. వీటి పరిధిలో వందల ఎకరాల వెంచర్లకు సంబంధించి సుమారు 70 దరఖాస్తులు అనుమతులకు నోచుకోక పెండింగులో ఉన్నాయి. భారీ సంఖ్యలో భవన నిర్మాణ దరఖాస్తుల అనుమతులు అటకెక్కాయి. లేఅవుట్‌ రుసుం ఎకరానికి రూ.25 వేలకు పైబడి ఉంటుంది. భవన నిర్మాణానికి రూ.5లక్షల వరకూ ఉంది. గత ఐదు నెలలుగా అనుమతుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో కోట్ల రూపాయల ప్రభుత్వానికి గండి పడుతోంది. నాలా ఫీజు చెల్లించి లేఅవుటు వేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున వ్యయం చేసి భూ అభవృద్ధి చేసిన స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ఆస్కారం లేక గగ్గోలు పెడుతున్నారు.

బోర్గాం శివారులో ఓ స్థిరాస్తి వ్యాపారి 100 ఎకరాల్లో ప్లాట్లు విక్రయించేందుకు వీలుగా భూమిని అభివృద్ధి చేశారు. అభివృద్ధికి రూ.కోట్లు వెచ్చించారు. ఐదు నెలలుగా లేఅవుటు అనుమతులు లేకపోవడంతో విక్రయాలు ఆగిపోయి సొమ్ము చేతులు మారే పరిస్థితి లేక అప్పుల వాళ్ల ఒత్తిళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖానాపూర్‌ వద్ద ఓ పెట్రోలు బంకు ఏర్పాటుకు అనుమతులు మంజూరు కాకపోవడంతో ఓ వ్యాపారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేకసతమతమవుతున్నారు. ఇదే కోవలో అపార్టుమెంట్లు, ఇళ్లు నిర్మించుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిసే ఆస్కారం ఉంది.

Related Posts