YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇసుకాసుర మాఫియా

ఇసుకాసుర మాఫియా

భూగర్భ జలాల్లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతుండటంతో ప్రభుత్వం ఇసుక తరలింపుపై నిషేధం విధించింది. ప్రభుత్వ భవనాలు, జలాశయాల నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇస్తోంది. క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన నిఘా లేకపోవడంతో ‘అనుమతి’ని గుత్తేదారులు ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. జలాశయాలకు తరలిస్తున్నామంటూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికెళ్లినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్ల అక్రమాలకు అడ్డూఅదుపు ఉండటం లేదు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోజూ వందలాది టిప్పర్ల, లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఓ వైపు పనులకు వినియోగిస్తూనే మరికొంత లారీ ట్రిప్పునకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు బహిరంగంగా విక్రయిస్తున్నారు.

చింతపల్లి మండలంలోని హోమంతాలపల్లి గ్రామ పంచాయతీలోని అనాజీపురం(నందిగడ్డ) వాగు నుంచి చింతపల్లి మండలంలోని కిష్టారాయనిపల్లి,   మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని ఇర్వేన్‌ గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా జలాశయాలు, కాల్వలను నిర్మిస్తోంది. వీటి నిర్మాణాలకు అనుమతి తీసుకొని రోజూ వందల లారీల, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. శివన్నగూడెం, కిష్టారాయనిపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న జలాశయానికి ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులను నమ్మించి ఇతర ప్రాంతాల్లో నిల్వచేస్తున్నారు. చింతపల్లి నుంచి మాల్‌ వరకు బయటి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రోజూ ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమారు రూ.2లక్షల వరకు చేతులు మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రామాల్లో ఇంటి నిర్మాణాలకు ఇసుక అవసరమైతే స్థానిక రెవెన్యూ అధికారులు ఇనుమతులు ఇవ్వడం లేదు. దీంతో గ్రామాల్లో కొరత ఏర్పడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రాజెక్టుల పేరిట ఇసుక అనుమతి తీసుకున్న గత్తేదారులు, దళారులు, టిప్పర్ల నిర్వాహకులు కుమ్ముకై గ్రామాల శివార్లలో ఇసుకను నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టులకు తరలిస్తున్నామంటూ బహిరంగ మార్కెట్‌ విక్రయిస్తున్నారు. జలాశయాలకు ఇసుకను తరలించే పలు టిప్పటర్లకు, లారీలకు నంబర్లు ప్లేట్లు ఉండటం లేదు. జలాశయానికి ఇసుకను తీసుకెళ్తున్నట్లు ప్రతి వాహనానికి అనుమతి పత్రాలతో కూడిన స్టిక్కర్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ గుత్తేదారులు ఆ నిబంధనను విస్మరిస్తున్నారు.

గతేడాది కృష్ణా పుష్కరాల్లో భాగంగా చింతపల్లి నుంచి దేవరకొండ మండలంలోని పడమటిపల్లి వరకు రూ.14 కోట్ల వ్యయంతో బీటీ రహదారిని విస్తరించారు. ఈరోడ్డుపై పరిమితికి మించి అధిక బరువుతో ఇసుకను రవాణా చేస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్‌, లారీలో 30 నుంచి 40 టన్నుల వరకు ఇసుకను తరలిస్తుండటంతో రహదారులు గుంతలమంగా మారుతున్నాయి. ఈ రహదారిపై కేవలం 8 నుంచి 10 టన్నుల బరువు కల్గిన వాహనాలు మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. గుత్తేదారులు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు ఒక్కసారీ తనిఖీలు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

అనాజీపురం వాగు నుంచి వందలాది వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నా.. సంబంధితశాఖల మధ్య సమన్వయం లేక అడ్డుకోలేకపోతున్నారు. దీంతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇసుకకు గనుల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారని తమకు ఎలాంటి సంబంధం లేదని స్థానిక రెవెన్యూ అధికారులు దాటవేస్తున్నారు. రాత్రివేళలో అక్రమంగా ఇసుక తరలించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొంటున్నారు. ఇలా గనులు, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయ కొరవడటంతో ఇసుక అక్రమార్కుల పంట పండుతోంది.

Related Posts