హైదరాబాద్ మార్చ్ 27
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో గల వెలో డ్రమ్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 72 వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షిప్ 2021 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సైక్లింగ్ డ్రం లో జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 27 రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది సైక్లింగ్ రైడర్లు ఈ చాంపియన్ షిప్ లో పాల్గొంటున్నారు. ఈ పోటీలు నేటి నుండి మార్చి 31 వరకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి తెలంగాణ ను క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు క్రీడల అభివృద్ధికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్య కోసం 0.5 శాతం, ఉద్యోగాలలో 2% రిజర్వేషన్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. హైదరాబాద్ నగరం క్రీడా హబ్ గా రూపొందించడానికి అనువైన సిటీగా దేశంలో ఇప్పటికే పేరుప్రఖ్యాతులు లభిస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఛైర్మన్ కచర్ల రాజ్ కుమార్, అధ్యక్షులు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, కార్యదర్శి కటకం దత్తాత్రేయ, కో చైర్మన్ అనురాగ్ సక్సెనా, విజయ్, డా. మాక్స్ వెల్ ట్రేవోర్, వెంకట్ కుంభం లతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.