YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దైవ ప్రసాదం

దైవ ప్రసాదం

ఆధ్యాత్మిక వాంగ్మయాలు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపమంటున్నాయి. ఆహారం గురించి వివరిస్తూ అన్నం సత్యమైందంటుంది ప్రశ్నోపనిషత్తు. అన్నం నుంచి విత్తు జనిస్తుంది. బీజమే సకల జీవరాశుల ఉద్భవానికి కారణం అవుతోంది. జీవులు ఆహారం కోసం పరితపిస్తాయి. ఆకలి అనే జఠరాగ్నిని తానేనంటాడు పరమాత్మ. అలా... సహజంగానే పరమాత్మ ఉనికికి జఠరాగ్నికి సంబంధం ఉంది. మనం భుజిస్తున్న ఆహారాన్ని దైవం తానై జఠరాగ్ని ద్వారా సూక్ష్మ దేహభాగాలకు అందిస్తాడని, అలా ఈ దేహం మనం చేసే ధర్మ సాధనలకు సహాయకారిణిగా ఉంటోందని గీతలో పరమాత్ముడి వాక్కు. అందుకే మనం భుజించే ఆహారం తొలుత దైవానికి నివేదించాలని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది.
జీవిలోని అన్నమయ కోశం దేవుడి నిలయమని అంటారు. అన్నమయ కోశానికి చేరిన ఆహారాన్ని దేహంలోని అన్ని భాగాలకు పంపేందుకు ఆ దైవం సహకరిస్తాడు. అలా చేరిన ఆహారంలోని శక్తివల్లనే జీవుడు శ్వాసిస్తున్నాడు. శ్వాసే జీవనాధారం. శ్వాస ఆగితే జీవం ఆగిపోతుంది. మనం భుజించే ఆహారం అంతటి పవిత్రమైంది. అందుకే అది పరబ్రహ్మ స్వరూపమైంది. అలాంటి ఆహారాన్ని దైవానికి మొదట నివేదించి ఆ పరాత్పరుడికి మన కృతజ్ఞత, ఉపకారస్మృతి తెలుపుకోవాలని యజుర్వేదంలోని ఆగమ శాస్త్రం వివరిస్తోంది.
ఆగమ శాస్త్రాల్లో దైవానికి సమర్పించే నైవేద్యానికి ఎంతో పవిత్రత ఉంది. ఈ నైవేద్యాన్ని ప్రసాదం అంటారు. నైవేద్యం అనంతరం ఈ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. ప్రసాదం అంటే దయ, కృప అని అర్థం. దేవుడి ప్రసాదాన్ని ఆయన నుంచి మనకు లభించిన అనుగ్రహంగా భావించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రసాదం భుజించడం అంటే పరాత్పరుణ్ని ధ్యానించే సాధనగా తలంచాలని శ్రీరమణులు చెప్పేవారు.
భగవంతుడిపై భక్తి, శ్రద్ధల వల్ల మనకు ప్రాప్తించే దైవానుగ్రహం అంతర్గతంగా క్షమగా రూపాంతరం చెంది, మానవత్వాన్ని పెంపొందిస్తుంది. దీనివల్లనే దైవానికి మనం సమర్పించే ఆహారం (నైవేద్యం) పారలౌకిక దయార్ద్రతగా, ప్రసాదంగా మారుతుందని యోగజం అనే ఆగమ శాస్త్రం వివరిస్తోంది.
పరాత్పరుడికి సమర్పించే నైవేద్యం సిద్ధం చేయడానికి కొన్ని ప్రత్యేక విధి విధానాలున్నాయి. నైవేద్యాన్ని సిద్ధం చేయడానికి ఏ జీవినీ హింసించకూడదు. ధన్వంతరీ శాస్త్రం సూచించిన విధానంలోనే సాత్విక నైవేద్యం సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూసే నెపంపై ఎంగిలి చేయకూడదు. నైవేద్యం తయారయ్యే వంటఇంట్లో పవిత్ర వాతావరణం ఉండాలి. నైవేద్యం వండుతున్నప్పుడు మాట్లాడకూడదు. భగవంతుడి కోసమే ఆహారం సిద్ధం చేస్తున్నామన్న భావన మనసులో నిండి ఉండాలి.
అన్నింటికన్నా మించి పరిశుభ్రత కీలకం. తాను సిద్ధం చేస్తున్న నైవేద్యం భగవంతుడికి రుచించాలన్న భావన ఉండాలి. భక్తులు తమకు ఎంత అవసరమో అంతే ప్రసాదం తీసుకొని మహా అదృష్టంగా భావించి మొత్తం భుజించాలి. తమకు ఆ ప్రసాదం ఎక్కువగా అనిపిస్తే... ఇతరులకు పంచిపెట్టాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పారవేయడమో వృథా చేయడమో తగనిది. కొందరు సగం తిన్న పులిహోర పొట్లాలను, లడ్డు లాంటి దైవ ప్రసాదాలను తిన్నంత తిని రోడ్లపై, చెత్తకుప్పల వద్ద పారవేస్తుంటారు.
తాము తినగలిగినంత ప్రసాదమే తీసుకోవాలని సర్వోక్తమ్‌ అనే ఆగమ శాస్త్రం చెబుతోంది. ప్రసాదాన్ని మాలిన్యానికి గురిచేయడం పాపకార్యమవుతుంది. మిగిలిన నైవేద్యాన్ని అన్నార్తులకో, ఆవులు ఇతర జీవులకో ఇవ్వాలి. నీటి ప్రవాహాల్లో, తటాకాల్లో, నదుల్లో మిగిలిన ప్రసాదాన్ని వేసినా మంచిదే! జలచరాలు భుజిస్తాయి.
 

Related Posts