హైదరాబాద్, మార్చి 30,
ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. నగరంలోని మౌలాలిలో ఓ స్థల వివాదంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి జోక్యం చేసుకున్నారు. తన అనుచరుడికి చెందిన స్థలాన్ని మరొకరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుని ఆమె వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్డును తొలగించారు. ప్రహరీని కూల్చివేయించారు. అంతేకాదు స్వయంగా ఆమె కూడా కొన్నింటిని తొలగించారు.వివాదాస్పద స్థలం వద్ద విజయారెడ్డి హల్‌చల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాదరావు తెలిపారు. తమ కార్యకర్త కుటుంబం ఆ స్థలాన్ని 1974లో కొన్నదని, ఇటీవల కొందరు వ్యక్తులు ఈ భూమి విషయంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని షెడ్డు వేసి దౌర్జన్యం చేస్తున్నారని విజయారెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో తన అనుచరుడికి అండగా ఉండేందుకే అక్కడికి వెళ్లినట్టు తెలిపారు.