హైదరాబాద్, మార్చి 30,
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పొందేలా చేస్తానని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తాం.. ప్రభుత్వ స్థలాలు వచ్చేలా చేస్తామని ప్రజలు, నిరుద్యోగులను మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల పీఏనంటూ సుధాకర్ మోసాలకు పాల్పడుతున్నాడు. అతడికి నాగరాజు, భీమయ్య సహకరిస్తున్నారు. ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి దర్యాప్తు చేశారు. ఫార్చూనర్ కారు సఫారీ డ్రెస్ లు వేసుకుని డమ్మీ గన్ ద్వారా వారు దందా నడిపిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో దాదాపు నిరుద్యోగులు, ప్రజల నుంచి రూ.2.2 కోట్లు వసూలు చేశారని తెలిసింది. ఈ ముగ్గురిని ఎస్సార్ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
సుధాకర్ గ్యాంగ్ లీడర్‌గా ఉంటుండగా నాగరాజు, భీమయ్య అతడికి సహకరించేవారు. ఈ విధంగా వారు 82 మందిని మోసం చేశారని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ స్థలాలు, ఉద్యోగాలు, తక్కువ డబ్బులకు బంగారం వంటి నేరాలకు పాల్పడ్డారని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. మొత్తం రూ.3 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. నిందితుల నుంచి రూ.కోటి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, కోటి రూపాయల ఇంటి పేపర్లు, ఫార్చూనర్ కారు, డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే సీఎం ఓఎస్డీగా, సెక్రటేరియట్ ఎంట్రీకి ఐడీ కార్డులు పొంది వారు ఈ దందా కొనసాగించినట్లు చెప్పారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ పిలుపునిచ్చారు