అనంతపురం, మార్చి 31,
అనంతపురం జిల్లాలో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు మినరల్ పేరుతో అక్రమ దందా చేస్తున్నారు. వివిధ మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం...ఇదే అదునుగా వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు మినరల్ వాటర్ పేరిట గరలాన్ని ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు లేకుండా జిల్లాలో మూడు వేలకు పైగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్‌ఐ గుర్తింపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రూ 10 నుంచి 15 లక్షల మంది మినరల్ నీటిని తాగుతూ అనారోగ్యం తెచ్చుకునే పరిస్థితి నెలకొనింది. తాగునీటి నాణ్యతను పరిశీలించాల్సిన రెవెన్యూ, పుడ్‌కంట్రోల్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. వాస్తవంగా బీఐఎస్ 60 రకాల నాణ్యత ప్రమాణాల పాటించాలని దిశానిర్ధేశం చేస్తోంది. కానీ నీటి శుద్ధి ప్లాంట్లు ప్రమాణాలను గాలికొదిలేసి అందులో పట్టుమని బేసిక్ ప్రమాణాలు కూడా పాటించడం లేదు. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం ఫిల్టర్ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిలో కరిగిన ఘన పదార్థాల మొతాదు లీటరు నీటికి 100–150 మి.గ్రా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నిబంధన పాటించడం లేదు. లీటరు నీటిలో క్యాల్షియం 75 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 30 మిల్లీ గ్రాములు ఉండాలి. అయితే ఇక్కడి ప్లాంట్లలో వివిధ రసాయనాలు కలిపి ఇచ్చేస్తున్నారు. ఫ్లోరైడ్ మోతాదు ఒక మిల్లి గ్రామ్ మించకూడదు. ఐరన్‌మోతాదు 0.3 మి.గ్రా ఉండాలి.వాటర్ ప్లాంట్ల నిర్వాహకులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, పుడ్ సేఫ్టీ అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అనధికారికంగా ప్లాంట్ నిర్వాహకులు యథేచ్ఛగా నీటి వ్యాపారం చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక ఆహార కల్తీ నిరోధకశాఖలో ఐదుగురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు గాను ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా నెల క్రితం ట్రైనింగ్‌కు వెళ్లారు. ఇక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. తాగునీటి వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. జిల్లాలో దాదాపుగా 43 లక్షల మంది జనాభా ఉంది. వీరిలో సగం మంది మినరల్ వాటర్‌కు అలవాటు పడ్డారు. బిందె రూ 6 నుంచి 10, క్యాన్ రూ 20తో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఇలా రోజూ రూ కోటికిపైగా జలవ్యాపారం జరుగుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ, మిగితా 11 మునిసిపాలిటీల్లో నీరు పూర్తీ స్థాయిలో సరఫరా చేయడం లేదు. కేటాయించిన ఎంఎల్‌డీ కంటే తక్కువే పదుల సంఖ్యలో మునిసిపాలిటీలకు నీరు సరఫరా అవుతోంది. అసలే వేసవికాలం కావడంతో నీరు సరిగా వస్తుందో లేదోనని ముందస్తుగా ప్రజలు నీటిని కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, గుత్తి, పామిడి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర, రాయదుర్గం, కదిరి తదితర ప్రాంతాల్లోని లక్షలాది మంది మినరల్ గరళాన్ని తాగుతున్నారు.