రంగారెడ్డి, మార్చి 31,
ప్రస్తుతానికి కరోనాతో బయిటకు రాకపోయిన వేసవి ముదరక ముందే ఎండలు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుత వేసవిలో గత రెండు, మూడు రోజులుగా అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. జిల్లా పరిధిలోని వివిధ చోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి అత్యధిక వేడిమితో ఎండలు భగభగమన్నాయి. గత రెండు , మూడు రోజులుగా వరుసగా 36 నుండి 38 డిగ్రీల మద్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. వేసవి ప్రారంభంలో 14-15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ రాగా ప్రస్తుతం ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరిగి కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుండి 20 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 29-30 డిగ్రీల నుండి 36-38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో జిల్లాలో ఎండల తీవ్రత మరింత ముదురుతుందని స్థానిక వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు నమస్తే తెలంగాణ తో తెలిపారు. గత ఫిబ్రవరి నెల చివరి వారం నుండే క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతున్నట్లు, ఒక్కసారిగా అత్యధిక వేడిమితో వాతావరణంలో ఆ మార్పులు కనబడుతున్నాయని అన్నారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయాన్నే చెమటలు పట్టే తీరు కనబడుతోందన్నారు. నియోజకవర్గంలో గురువారం కూడా ఎండలు దంచి కొట్టడంతో ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఎండలు భగభగమనడంతో ప్రజలు ఎండల భారి నుండి రక్షణ పొందేందుకు ఆరాటపడుతున్నారు. చల్లని పానీయాలను సేవించి వేసవి తాపం తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నారులను కలిగిన మహిళలు ఎండలో అసలు అడుగు పెట్టడంలేదు. జిల్లాలో ఎండలు ముదురుతుండడంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎండలో తిరిగేందుకు జడుస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగి మరింత ముదరడంతో ప్రజలు బెంబేలు పడిపోతున్నారు. తాండూరు నియోజకవర్గంలోని నాపరాళ్ల గనులు, సుద్ధ గనులు, సిమెంట్ పరిశ్రమలో రోజు వారి పనులు చేసే కార్మికుల్లో మహిళల సంఖ్య ఎక్కువే. దీంతో ఎండల తీవ్రత వల్ల మహిళా కార్మికులు, కూలి పనులు చేసుకునే వారు ఎండలకు జడుస్తున్నారు. మధ్యాహ్నం వేళ పనులకు ఉపక్రమించడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఈ కూలీల ఉపాధికి గండిపడుతున్నది. పగటి పూట నాపరాళ్ల గనుల్లో కార్మికులు దాదాపు పనులు పూర్తిగా నిలిపినేస్తున్నారు. పగటి పూట ఎండల తీవ్రతతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు మండలంలోని నాపరాళ్ల గనులు, పెద్దేముల్ మండలంలోని సుద్ధ గనుల్లో కార్మికులు మధ్యాహ్నం వేల చెట్ల కింద, నీడ ఉండే ప్రదేశాల్లో సేద తీరుతుండడం కనిపిస్తున్నది. ప్రస్తుత వేసవిలో గత రెండు, మూడు రోజులుగా అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.కరోనా ప్రభావంతో ఎండల తీవ్రతతో మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గుతున్నది. తాండూరు ప్రాంతంలో నాపరాళ్ల గనులున్నా హైదరాబాద్ నగరం కంటే ఒకటి, రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయన్నారు. సాధారణంగా వేసవి ప్రారంభంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పం నుండి అత్యధిక స్థాయికి చేరుకొనడం సహజమని, అయితే ప్రస్తత వేసవిలో అనూహ్యంగా ఒక్కసారిగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం చాలా అరుదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వారు తెలిపారు.