న్యూఢిల్లీ, మార్చి 31,
మరో ఏడాది కళ్లు మూసుకుంటే ఈనాటి తరం ఒక అద్భుతం చూస్తుంది. ఇప్పటి జనరేషన్ లో అతి కొద్ది మంది తప్ప అంతా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పుట్టిన వారే. ఆ మాటకు వస్తే కేంద్రంలోని మోడీ, దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు వంటి వారంతా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పుట్టిన వారే. ఇక దేశంలో 140 కోట్ల మంది జనాభాలో 75 ఏళ్ళు దాటిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. అంటే 2022లో దేశ స్వాతంత్య్ర రజతోత్సవ వేడుకలను చూసే భాగ్యం వర్తమాన తరానికే ఉందన్నమాట.ఇక 2022 ఆగస్ట్ 15 నాటికి దేశానికి స్వేచ్చ వచ్చి 75 ఏళ్ళు నిండుతాయి. దాన్ని అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. దేశభక్తి కలిగిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఈ అవకాశాన్ని బాగా వాడుకుంటోంది కూడా. దీనికి ముందు 1997లో స్వర్ణోత్సవ వేడుకల సందర్భం వచ్చింది. అయితే నాడు యూనైటెడ్ ఫ్రంట్ దేశంలో అధికారంలో ఉంది. ప్రధానిగా ఐకె గుజ్రాల్ ఉన్నారు. ఎన్నో పార్టీలతో మిళితం అయిన ఈ కూటమి గట్టిగా పాలన మీదనే దృష్టి పెట్టలేకపోయింది. దాంతో స్వర్ణోత్సవ వేడుకలను ప్రతిష్టగా నిర్వహించలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో ఇపుడు బీజేపీకి ఆ లక్కీ చాన్స్ వచ్చింది. తొలి ప్రధాని నెహ్రూ తరువాత మోడీ ఇపుడు అలాంటి భాగ్యాన్ని అందుకోనున్నారు.ఇక ప్రధానిగా మోడీ ఉన్న ఈ టైంలో రజతోత్సవాలు జరగడం బీజేపీకి కొత్త ఊపుని తీసుకురానున్నాయి. అదే సమయంలో దేశానికి రాష్ట్రపతిగా ఎవరు ఉంటారు అన్నది చర్చగా ఉంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అంతకు నెల ముందు అంటే జూలైలో తన అయిదేళ్ల పాలనకు విరమణ ప్రకటిస్తూ మాజీ అయిపోతారు. దాంతో రాష్ట్రపతి ఎన్నికలు 2022లో జరుగుతాయి. ఎవరు కొత్త రాష్ట్రపతి అవుతారో కానీ వారికి వెంటనే ఈ సువర్ణ అవకాశం స్వాగతం పలుకుతూ ఉంటుంది. మరి ఉప రాష్ట్రపతిగా అడుగు దూరంలో ఉన్న వెంకయ్యనాయుడుకి ఈ అరుదైన చాన్స్ దక్కేనా అన్నది కూడా మరో చర్చ.ఇక కొత్త రాష్ట్రపతి ఎవరు అవాలన్నా బీజేపీ చేతుల్లోనే ఉంది. బీజేపీకి లోక్ సభలో 303 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్య సభలో కూడా తొంబై మందికి పైగా ఎంపీలతో కడు బలంగా ఉంది. దేశంలోని ఇప్పటికీ మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీవే అధికారంలో ఉంది. దాంతో బీజేపీ మాట చెల్లుబాటు అవుతుంది. మోడీ మదిలో ఎవరు ఉంటే వారే కొత్త రాష్ట్రపతి అని అంటున్నారు. అయితే వెంకయ్యనాయుడుకు కూడా అవకాశం ఉండవచ్చు అన్నది ఒక చర్చ. ఆయన తెలుగు వారు. పైగా ఏపీకి సంబంధించిన వారు. ఆయన ఈ ఉప రాష్ట్రపతి అయ్యాక అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. తెలంగాణా నుంచి కేసీయార్ మద్దతు ఎటూ ఉంటుంది. సాటి తెలుగు వారు అన్న దాని మీద జగన్ కూడా మద్దతు ఇస్తే భారీగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయన వైపు ఉన్నట్లే. తమిళనాడులో ఎవరు పవర్ లోకి వచ్చినా కూడా వెంకయ్యకు మద్దతు దక్కుతుంది. కర్నాటకలో ఎటూ బీజేపీ సర్కార్ ఉంది. దాంతో సౌత్ నుంచి వెంకయ్య మంచి స్కోర్ సాధించి ఎలక్ట్రోల్ కాలేజ్ లో తన బలం చూపిస్తారు అంటున్నారు. కానీ మోడీ ఓకే అంటేనే ఆయనకు రాష్ట్రపతి పదవి దక్కేది. మోడీకి వెంకయ్యకు మధ్య ఎలాంటి విభేదాలు ఇప్పటిదాకా లేవు కాబట్టి కొత్త రాష్ట్రపతి ఆయన అయితే మాత్రం అరుదైన భాగ్యం రజతోత్సవ వేళ సొంతమవుతుంది అంటున్నారు.