YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రామ్ మాధవ్ ఘర్ వాపసీ

రామ్ మాధవ్ ఘర్ వాపసీ

న్యూఢిల్లీ, మార్చి 31,
బీజేపీలో కీలక నేతగా ఉన్న రాంమాధవ్‌ ఘర్‌వాపసీ ఎందుకయ్యారు? ఆర్ ఎస్ ఎస్ వెనక్కి పిలిచిందా లేక.. బీజేపీతో దూరం పెరిగిందా? గతంలో కూడా ఆర్‌ ఎస్ ఎస్  నుంచి బీజేపీకి వెళ్లినవారు వెనక్కి తిరిగొచ్చిన సందర్భాలు ఉన్నాయా? పరివార్‌ క్షేత్రాలతోపాటు.. రాజకీయవర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? బెంగళూరు వేదికగా జరిగిన ఆర్ ఎస్ ఎస్  సంస్థాగత మార్పుల్లో అందరి దృష్టీ సంఘ్‌ ప్రధాన కార్యదర్శిపైనే నెలకొంది. భయ్యాజీ జోషీ స్థానంలో సర్‌కార్యవాహ్‌గా దత్తాత్రేయ హోసబాలే రావడంపైనే చర్చించారు. కానీ.. ఈ చేర్పుల్లో ఉన్న మరో ముఖ్యమైన పేరు.. రాంమాధవ్‌. ఆయన్ని అఖిల భారత కార్యకారిణలోకి తీసుకున్నారు. సంఘ్‌ పరిభాషలో ఈ పోస్టును నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా చెప్పుకోవచ్చు. బీజేపీలో కీరోల్‌ పోషిస్తూ.. పార్టీ విజయగాథలో రాంమాధవ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సమయంలో జరిగిన ఈ మార్పు పొలిటికల్‌ సర్కిల్స్‌ను ఆశ్చర్యపరిచింది. రాజకీయాలపై ఇంకాస్త ఆసక్తి ఉన్నవారు రాంమాధవ్‌ ఘర్‌వాపసీ వెనక ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారట. రాంమాధవ్‌.. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా.  సంఘ్‌లో సుదీర్ఘకాలంగా ఫుల్‌టైమ్‌ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలు బీజేపీకి కూడా అవసరం అనుకున్న సంఘ్‌ పెద్దలు రాంమాధవ్‌ను కమలనాథుడిగా మార్చారు. అప్పటికే రాంమాధవ్‌ అంటే ఒక గుర్తింపు ఉండటంతో అది ఆయనకు కలిసి వచ్చింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా.. ప్రధాన కార్యదర్శిగా పార్టీ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు రాజకీయ వైరుధ్యం కలిగిన పీడీపీ తో పొత్తు పెట్టుకోవడంలో రాంమాధవ్‌దే కీరోల్‌. అటు నుంచి ఆయన ఫోకస్‌ ఈశాన్య రాష్ట్రాలకు మళ్లింది. ఆయా రాష్ట్రాలో బీజేపీ పుంజుకోవడానికి, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా చేయడంలో వెనకుండి చక్రం తిప్పారు కూడా.  ఒకానొక సందర్భంలో రాజకీయ పార్టీలు ఉన్నది చారిటీల కోసం కాదని.. అధికారంలోకి రావడమే వాటి లక్ష్యమని కుండబద్దలు కొట్టి కొత్త చర్చకు బాట వేశారు రాంమాధవ్‌. ఉన్నట్టుండి బీజేపీలో రాంమాధవ్‌ సైలెంట్‌ అయ్యారు. జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడైన తర్వాత ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. కానీ... రాజ్యసభకు పంపించి ప్రధాని మోడీ తన క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఆ పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుందా అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో రాంమాధవ్‌ బీజేపీ నుంచి ఆర్‌ ఎస్ ఎస్ కు వెనక్కి వెళ్లడంతో ఏం జరిగిందా అని అంతా చెవులు కొరుక్కున్నారు. ఒకసారి సంఘ్‌ నుంచి బీజేపీకి వెళ్లితే.. రాజకీయ నేతగానే జీవితం ముగించిన వారు ఎందరో ఉన్నారు. వెనక్కి ఆర్‌ ఎస్ ఎస్ కి వెళ్లడం చాలా అరుదు. రాంమాధవ్‌కుముందు  బీజేపీ సంఘటనా కార్యదర్శిగా ఉన్న రాంలాల్‌ విషయంలో అదే జరిగింది. ప్రస్తుతం సంఘ్‌ నుంచి బీజేపీకిలోకి వెళ్లిన బీఎల్  సంతోష్‌ సంఘటనా కార్యదర్శిగా ఉన్నారు. ఇది చాలా కీలకమైన పోస్ట్‌. ఆర్‌ ఎస్ ఎస్ , బీజేపీలకు మధ్య అనుసంధానం చేసే బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. గతంలో గోవిందాచార్య, సంజయ్‌ జోషి వంటి వారిని ఇదే విధంగా బీజేపీలోకి పంపింది ఆర్‌ఎస్‌ఎస్‌.  సిద్ధాంతకర్తగా గోవిందాచార్య పేరు తెచ్చుకున్నారు కూడా. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన్ని బీజేపీ దూరం పెట్టింది. సంఘ్‌ మాత్రం వెనక్కి తీసుకోలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాంమాధవ్‌ విషయంలో సక్సెస్‌ మంత్రమే తప్ప.. ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు..వినిపించలేదు. ఆయన విషయంలో ఏం జరిగిందో ఆర్‌ ఎస్ ఎస్ , బీజేపీ ల నుంచి చిన్నపాటి లీకులు కూడా లేవు. ఒకవేళ ఎవరిని కదిపినా.. 'సంఘ్‌లో ఇది మామూలే. అప్పగించిన పని అయిపోతే ఇంకో కార్యక్షేత్రంలోకి వెళ్తారు.. అంతకు మించి ఏమీ లేదు. ప్రచారక్‌గా ఉన్న రాంమాధవ్‌ విషయంలోనూ అదే జరిగింది' అని చాలా సాధారణ విషయంగా చెబుతున్నారు. కానీ రాజకీయాలను దగ్గర నుంచి చూసే వారు మాత్రం ఇది అసాధారణ నిర్ణయంగా చెప్పుకొస్తున్నారు. అంతేతప్ప అంతకుమించి విశ్లేషణ చేయడం లేదు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఊహకు అందని విధంగా రాంమాధవ్‌ ఘర్‌వాపసీ జరగడం అందరినీ ఆశ్చర్య పరిచిందన్నది నిజం!

Related Posts