న్యూ ఢిల్లీ మార్చ్ 31
బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఆ దేశ త్రివిధ దళాధిపతులు రాజీనామా చేశారు. కోవిడ్ నియంత్రణలో అధ్యక్షుడు బొల్సనారో విఫలం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిని మార్చాలనుకున్నారు. ఆ క్రమంలోనే త్రివిధ దళాధిపతులు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఎటువంటి కారణాలు వెల్లడించకుండానే.. త్రివిధ దళాధిపతుల రాజీనామాను రక్షణ మంత్రి ప్రకటించారు. అయితే రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్తగా ఎవర్ని నియమిస్తారో ఇంకా వెల్లడించలేదు. సైన్యంపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు బొల్సనారో ఈ మార్పులు చేస్తున్నట్లు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కోవిడ్‌ను నియంత్రించడంలో బొల్సనారో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన పాపులారిటీ తగ్గిపోయింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు కరోనా వల్ల సుమారు 3.14 లక్షల మంది మరణించారు. మంగళవారం రోజు కొత్తగా సుమారు 4వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రెండేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బొల్సనారో .. కోవిడ్ వేళ క్వారెంటైన్ ఆంక్షలను వ్యతిరేకించారు. కోవిడ్ ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆరోపించారు. కరోనా గురించి ఆలోచించ వద్దు అంటూ ప్రజలను కోరారు కూడా. అయితే విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు సోమవారం రాజీనామా చేశారు. దీంతో క్యాబినెట్‌ను మార్చాలని బొల్సనారో నిర్ణయించారు.అధ్యక్షుడి వ్యవహార శైలితో వ్యతిరేకించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాధిపతులు.. ఒకేసారిగా రాజీనామా చేయడం బ్రెజిల్ చరిత్రలో ఇదే మొదటిసారి. జనరల్ ఎడ్సన్ లీల్ పుజోల్, అడ్మిరల్ ఇల్‌క్వెస్ బార్బోసా, లెఫ్టినెంట్ బ్రిగేడియర్ ఆంటోనియో కార్లోస్ బెర్ముడేజ్‌లు మంగళవారం ఒకేసారి రాజీనామా చేశారు.అంతకముందు విదేశాంగ మంత్రి ఆరుజో రాజీనామా చేశారు. చైనా, భారత్, అమెరికాతో సరైన సంబంధాలను ఏర్పర్చుకోవడంలో ఆరుజో విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లు కావాల్సిన రీతిలో అందలేదన్న విమర్శులు వెల్లువెత్తాయి.