ముంబై మార్చ్ 31
మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది బాంబే హైకోర్టు. హోంమంత్రిపై ఆరోపణలు చేశారు మరి ఎఫ్ఐఆర్ ఎక్కడ? మీకోసం చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టాలి? పోలీస్ అధికారులు, మంత్రులు, రాజకీయ నాయకులు ఏమైనా చట్టం కంటే ఎక్కువా? మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోకండి. చట్టమే మీ కంటే ఎక్కువ అని బాంబే హైకోర్టు బుధవారం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పరమ్‌బీర్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పరమ్‌బీర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.ముంబై కమిషనర్ పదవి నుంచి తప్పించి హోంగార్డ్స్ శాఖకు మార్చిన తర్వాత పరమ్‌బీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హోంమంత్రి వసూళ్లకు ఆదేశించినట్లు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని పరమ్‌బీర్ చెప్పగా.. మరి విచారణ జరపడానికి ఎఫ్ఐఆర్ ఉండాలి కదా. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? ఎఫ్ఐఆర్ లేకుండా విచారణ ఎలా జరుపుతారు అని విచారణ జరిపిన జస్టిస్ సీజే దత్తా అన్నారు. అసలు ఎఫ్ఐఆర్, విచారణ లేకుండానే దానిని సీబీఐకి అప్పగించాలని ఎలా అడుగుతారని కూడా పరమ్‌బీర్‌ను ప్రశ్నించారు.