న్యూఢిల్లీ మార్చ్ 31
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించింది. మొత్తం 85 రైతు సంఘాలతో తాము సంప్రదింపులు జరిపినట్లు ఈ సందర్భంగా కమిటీ వెల్లడించింది. వాళ్లందరితో మాట్లాడిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించినట్లు చెప్పింది. అయితే రిపోర్ట్ లో ఏముందో మాత్రం బయటకు వెల్లడించలేదు. దీనిపై ఏప్రిల్ 5న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.గత జనవరి 12న వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు అమలును నిలిపేసి కమిటీని నియమించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంతో ఎన్నో రౌండ్ల చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.