న్యూఢిల్లీ, ఏప్రిల్ 1,
దేశంలోని పౌరులకు గుర్తింపు సంఖ్యలా ఆధార్ ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా భూములకు కూడా ఏకైక గుర్తింపు సంఖ్యను త్వరలో కేంద్రం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. దీంతో దేశంలోని ప్రతి భూమికి సంబంధించిన రికార్డు ఆన్‌లైన్ లో నమోదు అవుతుంది. ప్రతి స్థలానికి ఆధార్‌లా యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది. దీన్ని 2022 మార్చి వరకు దేశంలో విస్తరించాలని కేంద్రం ఆలోచిస్తోంది.డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ ను ఇప్పటికే 10 రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. అయితే 2022 మార్చి వరకు దేశంలో దీన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో డిజిటలైజ్ అయ్యే భూముల వివరాలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తారు. దీనివల్ల భూముల మోసాలు జరగకుండా ఉంటాయి.ఇక భూములకు చెందిన ఒక రికార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు రూ.3 ఖర్చు అవుతుంది. అదే ఒక భూయజమానికి చెందిన ఆధార్ డేటాకు అయితే రూ.5 అవుతుంది. ఇక ఒక జిల్లాలో ఈ ప్రాజెక్టుకు రూ.50 లక్షలు ఖర్చవుతాయి. ఈ క్రమంలో రెవెన్యూ కోర్టు మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు రూ.270 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను కేంద్రం ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అతి త్వరలోనే దేశంలో మరిన్ని రాష్ట్రాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది.