హైదరాబాద్, ఏప్రిల్ 1,
ఆల్ ల్యాండ్ ప్రోబ్లమ్స్‌కు వన్ అండ్ ఓన్లీ సోల్యూషన్.. అన్ని రకాల భూ సమస్యలకు సర్వరోగ నివారిణిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఇపుడు సమస్యల కేంద్రంగా మారింది. నిజాం పాలకుల హయాంలో తప్ప ఆ తర్వాత భూసర్వే నిర్వహించిన దాఖలాలు లేవు.. పాస్‌పుస్తకాలపై సీఎంల ఫొటోలు మారాయే కాని, గజిబిజిగా ఉన్న ల్యాండ్ ఇష్యూస్ పరిష్కారం కాలేదంటూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేసి మరీ రూపొందించిన ధరణి ఇపుడు వినియోగ దారులకు ఎగతెగని సమస్యలను తెచ్చిపెడుతోంది.తొలుత సమగ్ర భూ సర్వేతో తొలి స్టెప్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత పావుగంటలో మ్యుటేషన్ .. పది నిమిషాల్లో పట్టదారు పాసుపుస్తకం.. అంటూ కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్టుతో ప్రత్యక్ష పర్వవేక్షణలో రూపుదిద్దుకున్నది ధరణి వెబ్‌సైట్ . సీఎంగా కేసీఆర్ భారీ అంచనాలతో దీన్ని రెడీ చేయించారు. కానీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులొస్తున్నాయి. ఈ పోర్టల్‌ను ప్రారంభించినప్పుడు భూముల అమ్మకాలు, గిఫ్ట్, ఫౌతి, భాగపంపకాల సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తర్వాత ఒక్కో మాడ్యూల్‌ను జతచేస్తూ వచ్చారు. ప్రస్తుతం ధరణి ద్వారా 32 రకాల సేవలు అందుతున్నాయి. ఇందులో భూ లావాదేవీలు, సమస్యల పరిష్కారానికి సంబంధించినవి 25 మాడ్యూల్స్ ఉన్నాయి. సమాచార మాడ్యూల్స్. ధరణిని ప్రారంభించి ఐదు నెలలు పూర్తైయింది. ఇప్పటివరకు 3.7 లక్షల లావాదేవీలు జరిగాయి. సగటున నెలకు 75 వేల లావాదేవీలు జరుగుతున్నాయి.
గ్రీవెన్స్ మాడ్యూల్‌తో సమయం ఆదా
భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే గ్రీవెన్స్ ఆప్షన్ల వల్ల సమస్యలు వేగంగా, పారదర్శకంగా పూర్తవుతున్నాయి. రైతుల డబ్బు, సమయం ఆదా అవుతోంది. గతంలో రిజిస్ట్రేషన్ మొదలు మ్యుటేషన్, నాలా కన్వర్షన్‌కు ఎంతో కొంత చేతులు తడపాల్సి వచ్చేది. అంతే కాదు అదనంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇందుకు వారాల నుంచి నెలల సమయం పట్టేది. కానీ.. ఇప్పుడు ధరణిలో రిజిస్ట్రేషన్‌తోపాటే మ్యుటేషన్ పూర్తవుతున్నాయి. పెండింగ్ మ్యుటేషన్లు, నాలాలు సైతం రూపాయి అదనంగా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. పెండింగ్ మ్యుటేషన్లకు 1.18 లక్షల దరఖాస్తులు రాగా వారాల వ్యవధిలోనే 1.14 లక్షలు పూర్తయ్యాయి. ఆధార్ సంబంధ సమస్యలు 3,453 వరకు పరిష్కరించారు. 19 వేల 403 మార్టిగేజ్ దరఖాస్తులకు అప్రూవల్ అయ్యాయి.
అన్ని రకాల భూ సమస్యలను ధరణిలోని గ్రీవెన్స్ మాడ్యూల్‌లో ప్రస్తావించడం సానుకూలంశం. చాలా మంది సరైన అవగాహన లేక తప్పు ఆప్షన్‌ను ఎంచుకొంటున్నారు. కలెక్టర్లు వాటిని తిరస్కరిస్తుండటంతో పోర్టల్‌పై అపోహలు వస్తున్నాయి. తమ సమస్య ఏ ఆప్షన్ కిందికి వస్తుందో స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి. అప్పుడే వేగంగా సమస్య పరిష్కారమవుతుందంటున్నారు అధికారులు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ అక్టోబర్ 29, 2020న ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధరణి పోర్టల్ అధికారికంగా ప్రారంభమైంది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ప్రతీ ఇంటి జాగాను కూడా త్వరలోనే కొలిచే ఆలోచన చేస్తోంది సర్కార్. పోర్టల్‌లో భూమి వివరాలు ఎక్కడ నుంచి అయినా చూసుకునే వెసులుబాటు ఉంది. పావుగంటలోనే రిజిష్ట్రేషన్ మ్యుటేషన్ జరుగుతుంది. పోర్టల్‌లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ప్రతీ ఇంచు భూమిని డిజిటిలైజేషన్ చేసే పని జరుగుతోంది. భూ సమస్య రైతుకు తలనొప్పిగా మారకుండా చూసే వెసులుబాటు. భూముల గోల్ మాల్ సంగతే లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండటం లేదు. ఎండోమెంట్, వక్ఫ్ భూముల కబ్జాలు లేకుండా చూసే మంచి కార్యక్రమం ధరణి.తాహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలను సక్సెస్‌గా నిర్వహిస్తున్నారు. రిజిష్ట్రేషన్లు పూర్తికాగానే మ్యుటేషన్ పూర్తవుతుంది. తాహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, స్కానర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ల కోసం అనుభవం ఉన్న డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్‌లను సైతం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.గతంతో పోల్చితే కొత్త పట్టాదార్ పాసుపుస్తకాల్లో విస్తీర్ణం తక్కువగా నమోదైనవారు దరఖాస్తు చేసుకొనేందుకు సిటిజన్ లాగిన్‌లో “అప్లికేషన్ ఫర్ మిస్సింగ్ సర్వే ఎక్స్‌టెంట్” ఆప్షన్‌ను జతచేశారు. ఇందులో జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్, ఉప సర్వే నంబర్‌ను ఎంచుకొన్న తర్వాత.. సంబంధిత యజమానికి ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి ఉన్నదో కనిపిస్తుంది. సమస్య ఉన్న సర్వే నంబర్‌ను ఎంచుకొని, పక్కన ఉన్న బాక్స్‌లో వాస్తవ విస్తీర్ణం ఎంత ఉండేదో వివరించాల్సి ఉంటుంది. ఇలా చేసిన దరఖాస్తులు అన్ని కలెక్టర్ వద్దకు చేరతాయి. ఈ దరఖాస్తులపై విచారణ జరిపి కలెక్టర్లు వాటిని పరిష్కరిస్తున్నారు.ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని, పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.తెలంగాణ రాష్ట్ర భూభాగం విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు. ఇప్పుడు ఇందులోని 1.53 కోట్ల ఎకరాలు ధరణిలోకి వచ్చింది. గతంలో భూ రికార్డులు మొత్తం ఎమ్మార్వోలు, వీఆర్వోల చేతుల్లో ఉండేవి. వాళ్లు రాసిందే రాత.. గీసిందే గీత. అందుకే భూ రికార్డులపై కఠినంగా ఉండాలని ధరణి పోర్టల్ ప్రారంభించింది. సుమారు 3.50 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. 3-4% భూములకు సమస్యలు ఉన్నాయి. పోర్టల్ వచ్చాక ల్యాండ్ రికార్డ్స్ ట్యాంపర్ చేసే అవకాశం లేదు. నిరక్షరాస్యులైన పేద రైతులు కూడా ధైర్యంగా ఉంటున్నారు. ధరణితో తమపై ఉన్న మచ్చ తొలిగిపోయిందని 98% ఎమ్మార్వోలు సంతోషంగా ఉన్నారు.
అయితే.. ధరణితో సమస్యలు లేవని కాదు. సమస్యలపై కూడా తరచూ మీడియాలో కథనాలు వస్తూనే వున్నాయి.
# కొద్ది భూభాగంలో సమస్య ఉంటే ఆ భూమి వున్న సర్వే నెంబర్ మొత్తం బ్లాక్
# జాయింట్ రిజిస్ట్రేషన్ భూములు కొనలేరు, అమ్ముకోలేరు
# ధరణి పోర్టల్‌లో కనిపించని జాయింట్ రిజిస్ట్రేషన్ కాలమ్
# తప్పులు సరిదిద్దుకునే రెక్టిఫికేషన్‌కు నో ఛాన్స్
# తప్పుల సవరణ కోసం కలెక్టరేట్ చుట్టూ చక్కర్లు
# కొత్త రిజిస్ట్రేషన్‌లకు లింక్ డాక్యుమెంట్ సమస్యలు
# సంస్థల భూముల క్రయవిక్రయాలకు నో ఛాన్స్
# ఎన్‌ఆర్‌ఐలు ఏ గుర్తింపు కార్డుతో కొనాలనేది పెద్ద డౌట్
# చట్టబద్ధ హక్కులు పొందడానికి వారసులకు తప్పని తిప్పలు
# ఇప్పుడు సేల్ డీడ్ రద్దు చేసుకునే ఆప్షన్ లేదు
# జీపీఏ, ఏజీఏ ద్వారా భూముల అమ్మకాలకు నో ఛాన్స్
# ల్యాండ్ డూప్లికేషన్‌తో నివాస స్థలాలకు రైతు బంధు పథకం
లింక్ డాక్యుమెంట్ మిస్సింగ్ ఓ ప్రధాన సమస్యగా మారింది. ఏ వద్ద బి భూమి కొని సికి అమ్మాడనుకుందాం. సి వద్ద డి అనే వ్యక్తి కొని ధరణిలో రిజిస్ట్రేషన్‌కు వెళ్తే… అక్కడ యజమానిగా ఏ పేరునే చూపిస్తోంది. అంటే ఒకసారి తన భూమిని అమ్మేసినా మరోసారి అమ్ముకునే ఛాన్స్ ఉంది. దీంతో కొత్త తగాదాలు వస్తున్నాయి. ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి వివాదాస్పదంగానో, ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూమిగానో ఉంటే మొత్తం సర్వే నెంబర్‌ను బ్లాక్ చేయడం అతి పెద్ద సమస్య. ఆ సర్వే నెంబర్‌లో మిగతా రైతులు… తమ సొంత భూమిని అమ్ముకోలేక కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తుల పేరుతో కాకుండా సంస్థల పేరుతో ఉండే భూములను అమ్మడం కొనడం ప్రస్తుతానికి అవకాశం లేదు. ఎవరైనా ఇద్దరు భాగస్వాములు కలిపి కొనుక్కున్న భూమిని అమ్ముకోలేని పరిస్థితి. జాయింట్ రిజిస్ట్రేషన్‌కు ధరణి పోర్టల్‌లో కాలమ్ అసలు లేదు. ఉమ్మడిగా వ్యక్తులే కాదు. సంస్థలు కూడా భూములు కొనుక్కునే పరిస్థితి ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. ఒకవేళ యజమాని చనిపోతే, అతని భూమిని కుటుంబ సభ్యులంతా కలిసి ఉమ్మడిగా అమ్మే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు చట్టబద్దమైన హక్కుదారుడు మాత్రమే అమ్మేలా మార్పులు చేశారు. ఆ చట్టబద్దత పొందేందుకు వారసులు ఇబ్బంది పడుతున్నారు. వారి మధ్య ఏకాభిప్రాయం లేకపోతే ఆ ఇబ్బంది తరతరాల భూసమస్యగా మారేందుకు ధరణి పోర్టల్ వల్ల ఆస్కారమేర్పడిందిఅయితే ధరణి పోర్టల్ ప్రారంభంలో ఎన్నో సమస్యలు కనిపించాయి. వాటిలో చాలా సమస్యలను మెల్లిమెల్లిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. చాలా సాంకేతిక సమస్యలను సులభంగా పరిష్కరించగలిగింది ధరణి పోర్టల్ టీం. అయితే, ఇప్పటికీ చాలా సమస్యలు ధరణి చుట్టూ తిరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతున్నా కొన్ని లోపాల వల్ల రిజిస్ట్రేషన్ కాని భూముల జాబితా పెరిగిపోతోంది. చిన్న చిన్న తప్పులను సవరించుకుంటూ వస్తున్నా ఇంకొన్ని సమస్యలు ధరణిని వదలడం లేదు. అంతా సాఫీగా అవుతుందని అనుకుంటున్న రిజిస్ట్రేషన్ల జగడాలతో చికాకులు తలెత్తుతున్నాయి. ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి వివాదాస్పదంగానో… ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూమిగానో ఉంటే మొత్తం సర్వే నెంబర్‌ను బ్లాక్ చేయడం అతి పెద్ద సమస్య. ఆ సర్వే నెంబర్‌లో మిగతా రైతులు… తమ సొంత భూమిని అమ్ముకోలేక… కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ఇద్దరు భాగస్వాములు కలిపి కొనుక్కున్న భూమిని అమ్ముకోలేని పరిస్థితి. జాయింట్ రిజిస్ట్రేషన్‌కు ధరణి పోర్టల్‌లో కాలమ్ అస్సలు లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే ఛాన్స్ లేదు. గతంలో ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు రిక్టిఫికేషన్ ఆప్షన్ ఉండేది. ఇది లేకపోవడంతో సమస్య మళ్లీ కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతోంది.కొత్తగా రిజిస్టర్ మ్యుటేషన్ అవుతున్న ఆస్తులకు లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఉండటం లేదు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఇలా 2 విభాగాలుగా తెలంగాణలోని భూములను విభజించి రిజిష్ట్రేషన్ చేస్తుండటంతో కొన్ని భూములు డూప్లికేట్ అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా భూములు వెంచర్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లుగా మారిపోయాయి. అలాంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూములు జాబితాలోనే ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ల భూములకు రైతు బంధు పథకం కూడా వస్తుండటం విడ్డూరం. గతంలో భూముల సర్వే నెంబర్లు తప్పుగా ఉన్నా… సరిహద్దుల కొలతలు తప్పుగా ఉన్నా ఎమ్మార్వో స్థాయిలో వాటిని సరిచేసుకునే వీలుండేది. ఇప్పుడు అధికారాలన్నీ కలెక్టర్ చేతికి వెళ్లేసరికి కలెక్టర్ ఆఫీస్‌ల చుట్టూ రైతులు తిరగడం కొత్త ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో భూముల అమ్మకాలు కొనుగోళ్లలో కొన్ని ప్రత్యేక నిబంధనలు రాసుకోవడం చాలా కామన్. భూమి అమ్మేటప్పుడే ఆ డాక్యుమెంట్లలో ఇరు వర్గాల అంగీకారంతో వీటిని రాసుకుంటారు. భూమి అమ్మిన రైతుకు అందులో ఉన్న బావులపై సగం హక్కులు కలిగి ఉండటం… అమ్మకం కాగా మిగిలిన భూమికి దారి హక్కు కలిగి ఉండటం ఇలాంటివి ముందుగానే రాసుకునేవాళ్లు. కొత్త ధరణి పోర్టల్‌తో ఫిక్స్‌డ్ ఫార్మాట్‌లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఛాన్స్ లేదన్నది ఇంకో విమర్శ.వ్యక్తుల పేరుతో కాకుండా సంస్థల పేరుతో ఉండే భూములను అమ్మడం కొనడం ప్రస్తుతానికి అవకాశం లేదు. ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో భూములు కొనడం, అమ్మడంపై క్లారిటీ లేదు. ఎన్‌ఆర్‌ఐలకు ఎలాంటి గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్‌తో చేస్తారనే విషయంలో గందరగోళం ఉంది. ఒకవేళ యజమాని చనిపోతే… అతని భూమిని కుటుంబ సభ్యులంతా కలిసి ఉమ్మడిగా అమ్మే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు చట్టబద్దమైన హక్కుదారుడు మాత్రమే అమ్మేలా మార్పులు చేశాడు. ఆ చట్టబద్దత పొందేందుకు వారసులు ఇబ్బంది పడుతున్నారు. రిజిష్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేల్ డీడ్ రద్దు చేసుకునే అవకాశం గతంలో ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటు తొలగించారు. ఇది కూడా కొన్ని ఇబ్బందులకు కారణం. జీపీఏ, ఏజీఏ ద్వారా భూముల అమ్మకాలు కొనుగోళ్లు గతంలో జరిగేవి. ఇది భూములతో వ్యాపారం చేసేవాళ్లకు లాభదాయకంగా ఉండేది. ఇప్పుడా ఆప్షన్‌ను తొలగించారు. ఇన్ని కొర్రీలు, కిరికిరిలు ఉన్న ధరణిలో మార్పుల కోసం కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు. జనంలో జగడాలు సృష్టిస్తున్న పోర్టల్‌లో పరిష్కారం చూపితేనే సమస్య పరిష్కారమవుతోంది.11-10-2020 ధరణి పోర్టల్‌పై తొలి కేసు నమోదైంది. వ్యవసాయేతర ఆస్తులను యజమానులే లోడ్ చేయాలన్న ఆదేశాలు వద్దని ఆక్షేపణ లేవనెత్తుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జీఆర్ కరుణాకర్ (రంగారెడ్డి), సీవీ నారాయణరావు (హైదరాబాద్)లు కోర్టులో దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ వివరణను కోరింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2020 నవంబర్ 3వ తేదీన వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాల నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. 2020 నవంబర్ 4వ తేదీన ఆస్తుల యజమానుల నుంచి ఆధార్ నంబర్, ఇతర వివరాలను ధరణి పోర్టల్‌లో లోడ్ చేయాలని పట్టుబట్టవద్దని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 2020 నవంబర్ 25న ఆస్తుల నమోదుకు ఆధార్, కులం వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరోసారి పిటీషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే జారీ చేసింది. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2020 డిసెంబర్ 16న ధరణి పోర్టల్‌పై హైకోర్టులో మరోసిరా విచారణ జరిగింది. పాత పద్దతిలో రిజిస్టేషన్ చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.