న్యూఢిల్లీ ఏప్రిల్ 1
చిన్న మొత్తాల వడ్డీలో కోత విధిస్తున్నట్లు ప్రకటించిన మోదీ సర్కార్ కొన్ని గంటల్లోనే వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే రంగంలోకి దిగి ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ ఆదేశాలను పొరపాటున జారీ చేశారని, వెంటనే వీటిని ఉపసంహరిస్తున్నట్లు ఆమె గురువారం ఉదయం ట్వీట్ చేశారు. చిన్న మొత్తాలు అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్‌సీ), ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లాంటి వాటిపై వడ్డీ రేట్లను తగ్గించడం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిపై ప్రభావం చూపిస్తుంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే మోదీ సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభావం ఎన్నికలపై ఎక్కడ పడుతుందో అన్న ఉద్దేశంతో వెంటనే వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2020-21 చివరి త్రైమాసికంలో చిన్న మొత్తాలపై ఉన్న వడ్డీరేట్లే ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. అంటే మార్చి 2021 నాటికి ఉన్న వడ్డీ రేట్లే ఉంటాయి. పొరపాటున ఇచ్చిన ఈ ఆర్డర్లను వెనక్కి తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. ఈ చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను 1.1 శాతం మేర తగ్గిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కన పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 6.4 శాతానికి చేరింది. 1974 తర్వాత ఇంత తక్కువ వడ్డీ రేటు ఇదే కావడం గమనార్హం. గతేడాదే ఈ చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను మోదీ సర్కార్ 0.7 శాతం నుంచి 1.4 శాతం వరకూ తగ్గించింది.