న్యూఢిల్లీ ఏప్రిల్ 1
దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 72,330 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గతేడాది అక్టోబర్ తర్వాత భారీగా పాజిటివ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. తాజాగా 459 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఒక్కరోజులో ఎక్కువ మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్ 17న 335 మంది మృత్యువాతపడ్డారు.తాజాగా 40,382 మంది డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,21,665కు చేరింది. ఇప్పటి వరకు 1,14,74,683 మంది కోలుకున్నారు. 1,62,927 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 5,84,055 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా 6,51,17,896 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.