YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఐదు నెలలైనా బాలరిష్టాలే

ఐదు నెలలైనా బాలరిష్టాలే

హైదరాబాద్, ఏప్రిల్ 2,
 తెలంగాణలో వందేళ్ల క్రితం నిజాం హయాంలో తప్ప ఆ తర్వాత భూసర్వే నిర్వహించిన దాఖలాలు లేవు. పాస్‌పుస్తకాలపై సీఎంల ఫొటోలు మారాయే కానీ… గజిబిజిగా ఉన్న ల్యాండ్‌ ఇష్యూస్‌ పరిష్కారం కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ సమస్యపై సీఎం కేసీఆర్‌ స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. సమగ్ర భూ సర్వేతో తొలి స్టెప్ వేశారు.ప్రతి సెంటుకు లెక్క చూపాలని భావించిన కేసీఆర్‌ పకడ్బంధీ వ్యవస్థ అవసరాన్ని గుర్తించారు. అవినీతి తుడిచి పెట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసేలా యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇలాంటి మథనం నుంచి వచ్చిందే ధరణి పోర్టల్. ఇప్పటి వరకు ఉన్న భూ సమస్యలన్నింటికి సింగిల్ సొల్యూషన్‌గా ధరణి పోర్టల్ ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. గతేడాది అక్టోబర్‌ 29న ఈ వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఉద్దేశం మంచిదే… టెక్నాలజీతో చాలా సమస్యలు పరిష్కరించ వచ్చు. ధరణి పోర్టల్ వస్తుందంటే రైతులంతా చాలా ఆనందం వ్యక్తంచేశారు. ల్యాండ్‌ చిక్కులు తొలగిపోయినట్టేనని భావించారు. గతంలో భూములు అమ్మాలన్నా కొనాలన్నా వీఆర్వో దగ్గరి నుంచి రిజిస్ట్రర్‌ ఆఫీస్‌ లో సిబ్బంది వరకు అందరి చేతులు తడపాల్సిందే. సర్వే ఆల్‌జీబ్రా సాల్వే చేసి తమ భూ సర్వే నెంబర్ తెలుసుకోవడం రైతులకో ఫజిల్. దాని చుట్టూ ఉన్న చిక్కులు ఛేదించుకొని రిజిస్ట్రేషన్ చేసి పాస్‌ పుస్తకం పొందడమంటే బిగ్‌ టాస్క్‌. రైతుల చెప్పులు కాదు కాళ్లే అరిగేవి… ముడుపులు సరేసరి.రిజిస్ట్రేషన్ ఒకచోట… మ్యుటేషన్ మరోచోట ఉండే తప్పుడు విధానాన్ని ధరణి పోర్టల్‌తో సవరించాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం. లంచగొండు అధికారులకు, రియల్‌ ఎస్టేట్ మాఫీయాకు ఒకేసారి చెక్‌ పెట్టాలని ధరణి తీసుకొచ్చింది. అంతా బాగానే ఉన్నా… గ్రౌండ్‌లెవల్లో ధరణి పోర్టల్‌పై అధ్యయనం చేయకుండానే అమల్లోకి తీసుకురావడం.. కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. పోర్టల్ ప్రారంభించిన తర్వాత… అనేక బాలారిష్టాలు చుట్టుముట్టాయి.చాలా సాంకేతిక సమస్యలను సులభంగా పరిష్కరించిదీ ధరణి పోర్టల్ టీం. అయినా ఇప్పటికీ చాలా సమస్యలు ధరణి చుట్టూ తిరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతున్నా… కొన్ని లోపాల వల్ల రిజిస్ట్రేషన్ కాని భూముల జాబితా పెరిగిపోతోంది. చిన్న చిన్న తప్పులను సవరించుకుంటూ వస్తున్నా ఇంకొన్ని ధరణిని ఆ సమస్యలు వదలడం లేదు. అంతా సాఫీగా అవుతుందని అనుకుంటున్న రిజిస్ట్రేషన్ల జగడాలు చికాకుపెడుతున్నాయి.ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి వివాదాస్పదంగానో… ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూమిగానో ఉంటే మొత్తం సర్వే నెంబర్‌ను బ్లాక్ చేయడం అతి పెద్ద సమస్య. ఆ సర్వే నెంబర్‌లో మిగతా రైతులు… తమ సొంత భూమిని అమ్ముకోలేక… కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు.ఎవరైనా ఇద్దరు భాగస్వాములు కలిపి కొనుక్కున్న భూమిని అమ్ముకోలేని పరిస్థితి. జాయింట్ రిజిస్ట్రేషన్‌కు ధరణి పోర్టల్‌లో కాలమ్‌ అస్సలు లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే ఛాన్స్ లేదు. గతంలో ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు రిక్టిఫికేషన్ ఆప్షన్ ఉండేది. ఇది లేకపోవడంతో సమస్య మళ్లీ కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతోంది.కొత్తగా రిజిస్టర్‌ మ్యుటేషన్ అవుతున్న ఆస్తులకు లింక్ డాక్యుమెంట్ నెంబర్‌ ఉండటం లేదు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఇలా 2 విభాగాలుగా తెలంగాణలోని భూములను విభజించి రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో కొన్ని భూములు డూప్లికేట్ అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా భూములు వెంచర్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లుగా మారిపోయాయి. అలాంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూములు జాబితాలోనే ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ల భూములకు రైతు బంధు పథకం కూడా వస్తుండటం విడ్డూరం కాక మరేంటి.గతంలో భూముల సర్వే నెంబర్లు తప్పుగా ఉన్నా… సరిహద్దుల కొలతలు తప్పుగా ఉన్నా ఎమ్మార్వో స్థాయిలో వాటిని సరిచేసుకునే వీలుండేది. ఇప్పుడు అధికారాలన్నీ కలెక్టర్ చేతికి వెళ్లేసరికి కలెక్టర్ ఆఫీస్‌ల చుట్టూ రైతులు తిరగడం కొత్త ఇబ్బంది.గ్రామాల్లో భూముల అమ్మకాలు కొనుగోళ్లలో కొన్ని ప్రత్యేక నిబంధనలు రాసుకోవడం చాలా కామన్. భూమి అమ్మేటప్పుడే ఆ డాక్యుమెంట్లలో ఇరు వర్గాల అంగీకారంతో వీటిని రాసుకుంటారు. భూమి అమ్మిన రైతుకు అందులో ఉన్న బావులపై సగం హక్కులు కలిగి ఉండటం… అమ్మకం కాగా మిగిలిన భూమికి దారి హక్కు కలిగి ఉండటం ఇలాంటివి ముందుగానే రాసుకునేవాళ్లు. కొత్త ధరణి పోర్టల్‌తో ఫిక్సిడ్‌ ఫార్మాట్‌లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఛాన్స్ లేదన్నది ఇంకో విమర్శ.వ్యక్తుల పేరుతో కాకుండా సంస్థల పేరుతో ఉండే భూములను అమ్మడం కొనడం ప్రస్తుతానికి అవకాశం లేదు. ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో భూములు కొనడం, అమ్మడంపై క్లారిటీ లేదు. ఎన్‌ఆర్‌ఐలకు ఎలాంటి గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్‌తో చేస్తారనే విషయంలో గందరగోళం గత్తరలేపుతోంది. ఒకవేళ యజమాని చనిపోతే… అతని భూమిని కుటుంబ సభ్యులంతా కలిసి ఉమ్మడిగా అమ్మే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు చట్టబద్దమైన హక్కుదారుడు మాత్రమే అమ్మేలా మార్పులు చేశాడు. ఆ చట్టబద్దత పొందేందుకు వారసులు ఇబ్బంది పడుతున్నారు.రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేల్ డీడ్‌ రద్దు చేసుకునే అవకాశం గతంలో ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటు తొలగించారు. ఇది కూడా కొన్ని ఇబ్బందులకు కారణం. జీపీఏ, ఏజీఏ ద్వారా భూముల అమ్మకాలు కొనుగోళ్లు గతంలో జరిగేవి. ఇది భూములతో వ్యాపారం చేసేవాళ్లకు లాభదాయకంగా ఉండేది. ఇప్పుడా ఆప్షన్ తొలగించారు. ఇన్ని కొర్రీలు, కిరికిరిలు ఉన్న ధరణిలో మార్పుల కోసం కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు. జనంలో జగడాలు సృష్టిస్తున్న పోర్టల్‌లో పరిష్కారం చూపేందుకు దారిలేదా…

Related Posts