వరంగల్, ఏప్రిల్ 2,
లాక్‌డౌన్‌తో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. అటవీ అధికారులు మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లో గిరిజనుల కండ్లుగప్పి భూముల్లోకెళ్లారు. భూములు చదును చేస్తుండగా గిరిజనులు అడ్డుకున్నారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధి శాత్‌రాజ్‌పల్లి రెవెన్యూ శివారులో జరిగింది.సర్వే నెంబర్ 26లోని 150 ఎకరాల్లో గిరిజన రైతులు 40 ఏండ్లుగా కబ్జాలో ఉంటూ పత్తి, జనుముతో పాటు వివిధ రకాల పంటలను సాగు చేసుకుంటున్నారు. అయితే, ఆ భూములను రెండ్రోజులుగా తాడిచెర్ల ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, శాత్‌రాజ్‌పల్లి బీట్ అధికారి రమణారెడ్డి జేసీబీతో చదును చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దతూండ్ల ఆదివాసీ గిరిజన రైతులు పెద్దఎత్తున భూముల వద్దకు చేరుకుని ఫారెస్ట్ అధికారులను, జేసీబీని అడ్డుకున్నారు. తమకు ప్రభుత్వం పట్టా పత్రాలు ఇచ్చాక.. ఎలా చదును చేస్తారంటూ నిలదీశారు. ఇవి ఫారెస్ట్ భూములేనని, ఎక్కువ మాట్లాడితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామనీ, ఈ భూములు మీరేమైనా సంపాదించారా..? అంటూ అధికారి శ్రీనివాస్‌రెడ్డి దుర్భాషలాడారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఈ భూములపై అన్ని హక్కులు ఉన్నాయనీ, లాక్‌డౌన్ ముగిశాక భూపాలపల్లి ఫారెస్ట్ ఉన్నతాధికారులు, కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామనీ అన్నారు. దుర్భాషలాడిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు.సర్వే నెంబర్ 26లోని భూములు ఫారెస్ట్‌వేనని, 11 నెలల కిందటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఫారెస్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ భూములను చదును చేస్తున్నాం. హరితహారంలో భాగంగా త్వరలో మొక్కలు కూడా నాటుతాం. గిరిజనులను తాను దుర్భాషలాడలేదు.