హైదరాబాద్, ఏప్రిల్ 2,
రాష్ట్రంలో పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. దాదాపు 11 నెలల తర్వాత ఓపెన్ చేసిన స్కూళ్లు, కాలేజీలు నెలన్నర రోజులు కూడా పనిచేయలేదు. కరోనా పేరుతో మార్చి 24 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మూసేసింది. ఓవైపు ఎగ్జామ్స్ దగ్గరపడుతుంటే, మరోవైపు ఆన్ లైన్ క్లాసులు అర్థం కాక స్టూడెంట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా రూరల్ ఏరియాల్లోని టెన్త్, ఇంటర్ పిల్లల్లో టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉన్నపళంగా యూనివర్సిటీలు, హాస్టళ్లు కూడా క్లోజ్ చేయడంతో పైచదువులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. మే ఫస్ట్ నుంచి ఇంటర్, మే 17 నుంచి టెన్త్ స్టూడెంట్లకు ఎగ్జామ్స్ పెట్టడానికి ఆయా బోర్డులు రెడీ అవుతున్నాయి. వాస్తవానికి కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో స్కూళ్లు, కాలేజీలు బందవగా సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూళ్లు, కాలేజీలు తెరిచారు. అప్పటివరకు ఆన్ లైన్ లో చెప్పిన పాఠాలను ఫిజకల్ క్లాసెస్ లో టీచర్లు, లెక్చరర్లు రివైజ్ చేస్తుండగా ఉన్నట్టుండి మళ్లీ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం మూసేసింది. ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ అవుతాయని చెప్పింది. మళ్లీ ఆన్ లైన్ క్లాసులు పెట్టడం వల్ల ఫిజికల్ క్లాసుల్లోనే ఒకటికి రెండు సార్లు చెప్పినా అర్థం చేసుకోని పిల్లలు ఎగ్జామ్తో ఇబ్బందిపడుతారని టీచర్లు, పేరెంట్స్ అంటున్నారు. ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకైనా కరోనా గైడ్లైన్స్ పాటిస్తూ స్కూళ్లు , కాలేజీలు ఓపెన్ చేయాలని కోరుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో సిలబస్ ను ప్రభుత్వం కుదించింది. టెన్త్ స్టూడెంట్స్ కు 30 శాతం సిలబస్ ను అసైన్ మెంట్ కు పరిమితం చేసి, మిగతా 70 శాతం సిలబస్కు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అలాగే ఇంటర్ లో కూడా సిలబస్ ను 70 శాతానికి పరిమితం చేసింది. గతంలో ఆన్ లైన్ క్లాసుల్లో మెజార్టీ స్టూడెంట్స్ సీరియస్ గా క్లాసులు వినలేదని విద్యాశాఖ వర్గాలే చెప్తున్నాయి. ఫిజికల్ క్లాసెస్ ద్వారా పిల్లలు కాస్త కుదుట పడి క్లాసెస్ ను సీరియస్ గా వినేటైమ్ లో మళ్లీ స్కూల్స్, కాలేజీలను క్లోజ్ చేయడంతో మెజార్టీ స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచి హిందీ సబ్జెక్టు బోధిస్తుంటారు. గత ఏడాది కరోనా కారణగా 5వ తరగతి పిల్లలను ప్రమోట్ చేశారు. ఆరో తరగతిలో హిందీ సబ్జెక్టు కొత్తగా పరిచయం అవుతుంది. వీరికి టీచర్స్ ముందుగా హిందీ అక్షరాలు నేర్పిస్తుంటారు. అయితే ఆరో తరగతి స్టూడెంట్లకు ఫిబ్రవరి 24 నుంచి స్కూళ్లలోనే క్లాసులు బోధించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తిరిగి నెలరోజుల్లోనే సూళ్లను మూసేసింది. ఈ నెల రోజుల్లో పిల్లలకు కనీసం హిందీ ఓనమాలు కూడా రాలేదని ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు అంటున్నారు. అంతకు ముందు ఆన్లైన్ క్లాస్లు నిర్వహించినా రూరల్ స్టూడెంట్లలో 90 శాతం మంది వినలేదని ఆఫీసర్ల అంచనా. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల మంది టెన్త్ పరీక్షలకు,10.5 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇందులో 60 శాతం స్డూడెంట్లు పల్లెల నుంచే ఉన్నారు. వీరిలో దాదాపు 70 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవని విద్యాశాఖ అంచనా వేసింది. స్కూళ్లలో క్లాసులు క్లోజ్ చేసి, మళ్లీ ఆన్ లైన్ క్లాస్ల కు అవకాశం కల్పించడంతో రూరల్ ఏరియాల్లోని ఇలాంటి స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి.