ఏలూరు, ఏప్రిల్ 2,
కొందరు అధికార పార్టీ నేతలకు చెరువు మట్టి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఎంతో విలువైన మట్టిని పలు ప్రైవేటు ఫ్యాక్టరీలకు అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనితో అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. ఉన్నతాధికారుల నుంచి అన్ని అనుమతులు పొందామంటూ ద్వారకాతిరుమల మండలం శరభాపురంలోని కండ్రిగకుంట చెరువు స్థలంలోని మట్టిని కొందరు నేతలు ఇష్టారాజ్యంగా తవ్వుకుని యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు శుద్ధిచేసిన గోదావరి జలాలను అందించే లక్ష్యంతో సర్వే నెం.106లోని దాదాపు 22 ఎకరాల చెరువు స్థలాన్ని లక్షలాది రూపాయల వ్యయంతో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ అభివృద్ధి చేసింది. అయితే నాలుగు ఎకరాల్లో మినహా మిగిలిన స్థలంలో చెరువును తవ్వడంతోపాటు వాటర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించారు. వీటి ద్వారా 26 గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నారు. ఇదిలావుంటే తవ్వకుండా విడిచిపెట్టిన స్థలంలో కొందరు వ్యక్తులు గత కొద్దిరోజులుగా జేసీబీ మిషన్ సహాయంతో మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఈ మట్టిని భీమడోలు మండలంలోని ఒక ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఈ తవ్వకాల వల్ల తమ వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు దారి లేకుండాపోతోందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ప్రస్తుతం వినియోగంలో ఉన్న చెరువుకు ముప్పువాటిల్లే ప్రమాదముందని అంటున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.గోపీకుంటకండ్రిగ చెరువు ప్రాంతంలో మట్టి తవ్వకాలకు తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ అమరేశ్వరరావు తెలిపారు. అలాగే ఖనిజాభివృద్ధి సంస్థ ఏడీ సీహెచ్ మోహనరావు వివరణ ఇస్తూ తాము ఈ ప్రాంతంలో తవ్వకాలకు ఈ మధ్యకాలంలో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, అక్రమంగా మట్టి తవ్వే వారిపై తగుచర్యలు తీసుకుంటామన్నారు.