ఏలూరు, ఏప్రిల్ 2,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లాడ - దేవరపల్లి రాష్ట్ర రహదారిగా, విభజన అనంతరం జీలుగుమిల్లి నుండి జంగారెడ్డిగూడెం మీదుగా దేవరపల్లి రాష్ట్రీయ రహదారిగా గుర్తింపు పొందిన కీలకమైన రహదారి గత పదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలచింది. జీలుగుమిల్లి నుండి జంగారెడ్డిగూడెం వరకు ఈ రహదారి నరకకూపంగా మారిపోయింది. గోతులు గతుకులతో నిత్యం వందలాది వాహనాలు పాడైపోతున్నాయి. ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షం వస్తే బురద, ఎండకాస్తే దుమ్ము, ధూళితో సహవాసం చేయవలసి వస్తోంది. రహదారి వెంబడి పంటలు సైతం దుమ్ము కొట్టుకు పోతున్నాయి. మూడేళ్ల క్రితం గోదావరి పుష్కరాలకు సుమారు రూ.30 కోట్ల నిధులతో రోడ్లు భవనాల శాఖ ఈరహదారికి మరమ్మతులు చేసింది, ఏడాది తిరక్కుండానే గోతులు పడి, రోడ్డు ఛిద్రమైపోయింది. ఈ రహదారిపై రాష్ట్ర వాహనాలతోపాటు మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల వాహనాలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటాయ. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఈ రహదారి హైదరాబాద్, విశాఖపట్నంకు దగ్గరి మార్గం. మహరాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుండి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, ఒడిస్సా వెళ్ళేందుకు ఈ రహదారి కీలకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రహదారి ఎప్పుడూ గోతులతోనే ఉంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.ప్రజా సంఘాలు ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. పాడైపోయిన రహదారి ఏళ్లతరబడి కళ్లకు కనిపిస్తున్నా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చూడలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ రహదారి దుస్థితి తెలిసి ఇటుగా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జంగారెడ్డిగూడెం-జీలుగుమిల్లి మధ్య ఈ రహదారి పూర్తిగా ఛిద్రమైపోయింది. వేగవరం, తాడువాయి గ్రామాల వద్ద, దర్భగూడెం, జీలుగుమిల్లి గ్రామాల వద్ద నిలువులోతు గోతులతో అత్యంత ప్రమాదకరంగా మారింది. 17 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ రహదారి నిర్మాణమైన కొద్ది నెలలకే అధ్వాన్నంగా తయారైంది. ప్రయాణాలకు వీలులేకుండా పోయింది. అప్పటి నుండి అడపా దడపా మరమ్మతులు చేసినా, పట్టుమని పది నెలలు ఈ రోడ్డు చదునుగా లేదు. రాష్ట్ర విభజనకు ముందు ఈ రహదారి తల్లాడ నుండి అశ్వారావుపేట వరకు దుర్భేధ్యంగా నిర్మించారు. అశ్వారావుపేట దాటి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించగానే రహదారి వెక్కిరిస్తుంది. జీలుగుమిల్లి నుండి జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వరకు అధ్నాన్నంగానే మిగిలిపోయింది. ఇప్పుడు గోతులు, గతుకుల మధ్య వాహనాలు సర్కర్ ఫీట్లు చేస్తున్నాయి.ఈ రహదారిలో ప్రయాణించలేక ఆర్టీసీ బస్సులను సైతం రూటుమళ్లించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ వెళ్ళే ఆర్టీసీ బస్సులు జంగారెడ్డిగూడెం నుండి మండలంలోని శ్రీనివాసపురం, పట్టెన్నపాలెం, రామారావుపేట జంక్షన్, రెడ్డిగణపవరం మీదుగా జీలుగుమిల్లి చేరుకుంటున్నాయి. కార్లు, ఇతర వాహనాలు సైతం డొంక రూటు వెంట మళ్లడంతో ఆ రహదారి కూడా పాడయిపోతోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా విస్తరించే ప్రతిపాదనలు కూడా కేంద్రానికి వెళ్ళాయి. కేంద్రం భద్రాచలం నుండి అశ్వారావుపేట, అక్కడి నుండి కొవ్వూరు గామన్ వంతెన వరకు జాతీయ రహదారిగా గుర్తించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంగాని, కేంద్ర ప్రభుత్వంగాని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపుతూ, జిల్లాలో అభివృద్ది చెందిన ప్రాంతాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, కనీసం ఉన్నతాధికారులు ఈ రహదారిపై ఒకసారి ప్రయాణించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రీయ రహదారి నిర్మాణ సాధన సమితి ఆధ్వర్యంలో రహదార్ల దిగ్భంధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, చింతలపూడి, గోపాలపురం ఎమ్మెల్యేలు, ఏలూరు, రాజమండ్రి ఎంపీలు ఎపీకి ప్రత్యేక హోదా మాటెలా ఉన్నా, ఈ రహదారి నిర్మాణం సాధించాలని ప్రజలు కోరుతున్నారు.