న్యూఢిల్లీ, ఏప్రిల్ 5,
కరోనా ఎంతో మందికి ఉద్యోగాలను, ఉపాధిని పోగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది పరిశ్రమలు మూత పడ్డాయి. భారత్‌లోనూ కరోనా దెబ్బకు ఎన్నో లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా మిగిల్చిన నష్టం నుంచి ఇంకా అనేక మంది కోలుకోనేలేదు. ఇంతలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరో చేదు వార్త చెప్పింది. 2025 వరకు ప్రపంచంలో ప్రతి 10 మందిలో 6 మంది ఉద్యోగాలను కోల్పోతారని వెల్లడించింది.వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 40 శాతం మంది ఉద్యోగులు రానున్న ఏళ్లలో తమ ఉద్యోగాలు పోతాయేమోనని భయంతో ఉన్నట్లు వెల్లడైంది. అలాగే 56 శాతం మంది తమకు ఉద్యోగం ఉంటుందని భావించారు. ఈ క్రమంలో సర్వే చేసిన వారిలో 60 శాతం మంది ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేశారు.ఇక మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం మంది మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటున్నారని వెల్లడైంది. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడంలో వారు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల 8.5 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోతారని తెలుస్తోంది. మొత్తం 19 దేశాల్లో 32వేల మందిపై సర్వే చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ వివరాలను వెల్లడించింది.