YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రచ్చకు దారి తీస్తున్న బహిష్కరణ

రచ్చకు దారి తీస్తున్న బహిష్కరణ

విజయవాడ, ఏప్రిల్ 5, 
నాయకుడు అంటే నమ్మాల్సిందే. ఆయనతో కలసి మరణమో విజయమో అన్నట్లుగా బరిలో దూకాల్సిందే. నాయకుడు ఏది చెప్పినా మన మంచికే అన్న విశ్వాసం కేడర్ కి కలగాలి. అది ఉన్న నాడు వారి మధ్యన ఎన్ని శక్తులు దూరినా ఏమీ చేయలేవు. గాలి కూడా చొరబడని విధంగా గాఢమైన బంధంగా అది ఉండాలి. కానీ తెలుగుదేశం అధినాయకుడి విషయంలో చూస్తే తొలిసారి తడబడ్డాడు, అంతే కాదు పొరపడ్డాడు అన్న మాట ఏకంగా సొంత తమ్ముళ్ళ నుంచే వస్తోంది. ఇది ఒక విధంగా టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు పనితీరుకు అతి పెద్ద రిమార్క్ గానే చెప్పుకోవాలేమో.తెలుగుదేశానికి ఎన్టీఆర్ ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో కూడా ఆయన మాట కంటే కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు మాటనే క్యాడర్ ఎక్కువగా వినేవారు. చంద్రబాబు సైతం వారి నమ్మకాన్ని ఎపుడూ వమ్ము చేయలేదు ఎన్ని దెబ్బలు తిన్నా కూడా క్యాడర్ ని తాను కాసుకుంటానని చెప్పి ముందుకు తోసేవారు. ఏనాడు చంద్రబాబు పిరికి మందు కార్యకర్తలకు నూరిపోయలేదు. పోరాట పటిమను వీడలేదు. అలాంటి చంద్రబాబు ఇపుడు ఎందుకిలా అయిపోయారు అన్నదే క్యాడర్ లో చర్చగా ఉంది.చంద్రబాబు రాజకీయ జీవితం సుదీర్ఘమైనది. ఆయన ఎంతో మంది ముఖ్యమంత్రులతో పనిచేశారు. చాలా మందితో ఎదురొడ్డి పోరాడారు కానీ ఆయనకు ఎక్కడా జగన్ లాంటి క్యారక్టర్ తారసపడలేదు. అందుకే బాబు ఎత్తులు జిత్తులూ జగన్ ముందు ఒక్కోటిగా చిత్తు అవుతున్నాయి. ఆ దిగులుతనంతో ఆ ఆలోచన లేమితో చంద్రబాబు ఏదేదో చేస్తున్నారు అన్న మాట అయితే పార్టీ నుంచే వినిపిస్తోంది. చంద్రబాబు జగన్ ని ఎదుర్కోవడంతో విఫలం అయ్యారు అని ఇపుడు తమ్ముళ్ళే అంటున్నారు అంటే అధ్యక్షుడిగా ఆయన మీదనే పార్టీ జనానికి విశ్వాసం తగ్గిపోతోంది అనుకోవాలేమో.చంద్రబాబుకు ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆయనే తీసుకున్నారో తెలియదు కానీ పరిషత్ ఎన్నికల బహిష్కరణతో ఒక్కసారిగా తమ్ముళ్ళు గ్రామాలలో తలలు దించుకునేట్లు చేశారని అంటున్నారు. నిజానికి గ్రామాలలో ఢీ అంటే ఢీ అనే సీన్ ఉంటుంది. అక్కడ జగన్ చంద్రబాబు ల పేరిట క్యాడర్ కత్తులు దూసుకుంటారు. ఓటమి వస్తే బాధపడతారు గెలుపు వస్తే జబ్బలు చరుస్తారు. అయినా సరే ఎన్నికలు అంటే ముందుకు ఉరుకుతారు. అలాంటిది ఎన్నికల జోలికే అసలు పోకుండా తన ప్రత్యర్ధులకు సునాయసం చేస్తూ ఇంట్లో కూర్చోమంటే క్యాడర్ ఎంతలా రగిలిపోతారో కదా. ఇపుడు తమ్ముళ్ళు అదే అంటున్నారు. మాకు సిగ్గు పోతోంది అని కూడా వారు బాధపడుతున్నారు. పార్టీకి చంద్రబాబు సారధి కావచ్చు కానీ రోడ్డు మీదకు వచ్చి పోరాడేది మాత్రం కార్యకర్తలే. మరి వారిని వెనక్కి పిలవడం ద్వారా బాబు తన వారికే వెన్నుపోటు పొడిచారా. లేక తమ శక్తి సామర్ధ్యాలనే అవమానించుకున్నారా. మొత్తానికి దీక్షా దక్షుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఫస్ట్ టైమ్ తన పొలిటికల్ కెరీర్ లో తడబడ్డారు.
తమ్ముళ్ల ఆగ్రహం
చంద్రబాబు నిర్ణయాన్ని అనేక మంది పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా గందరగోళం ఏర్పడింది. అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తాము సమర్థించలేమని గట్టిగా చెబుతున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాము అమలు చేయబోమంటూ అనేక చోట్ల బరిలో ఉంటామని, పోటీ నుంచి వెనక్కు తగ్గబోమని నేతలు ప్రకటించడం చంద్రబాబు నిర్ణయం ఏ మేరకు అమలవుతుందో చెప్పకనే తెలుస్తోంది.చంద్రబాబు ఆచితూచి, తప్పనిసరి పరిస్థితుల్లో బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు పదే పదే చెబుతున్నప్పటికీ నేతలు మాత్రం అంగీకరించడం లేదు. ప్రధానంగా పార్టీకి లాయల్ గా ఉండే నేతలే చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. తొలుత జ్యోతుల నెహ్రూ ఉపాధ్యక్ష పదవికి రాజీనామాతో మొదలయిన వ్యవహారం ఇప్పుడు అన్ని జిల్లాలకు చుట్టుకుంది. విజయనగరంలో తాము బరిలోకి దిగుతున్నట్లు ఆదితి గజపతి రాజు ప్రకటించారు.విశాఖలో సీనియర్ నేత, పార్టీకి అత్యంత విధేయుడు బండారు సత్యనారాయణ మూర్తి సయితం తమ అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రకటించారు. ఇక నారాలోకేష్ పోటీ చేసిన మంగళగిరిలోనూ టీడీపీ నేతలు ఎదురుతిరిగారు. తాము దుగ్గిరాల ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంటామని స్థానిక నేతలు చెబుతున్నారు. అనేక మంది పోటీ లో ఉన్న అభ్యర్థులు నేతల వద్దకు వచ్చి తమ పరిస్థిితి ఏంటని ప్రశ్నిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సయితం అంగీకరించక తప్పలేదు.చంద్రబాబు నిజానికి ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు. సీనియర్ నేతలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ టీడీపీ క్యాడర్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. రెండేళ్ల పాటు వైసీపీ నుంచి తాము వత్తిళ్లు ఎదుర్కొన్నా నిలబడగలిగామని, ఇప్పుడు సడెన్ గా బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే ఎలా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నామినేషన్లు వేసిన వాళ్లంతా పోటీలో ఉండేందుకే ఇష్టపడుతుండటంతో నేతలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని థిక్కరించేందుకు సిద్ధమయ్యారు. అశోక్ గజపతి రాజు ఇప్పటికే పరిషత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పొలిట్ బ్యూరోలో ఉండే సభ్యులే అడ్టంతిరగడంతో చంద్రబాబుకు తలనొప్పిలా మారింది. మొత్తం మీద చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పార్టీలో గందరగోళానికి తెరతీసిందనే చెప్పాలి.

Related Posts