హైదరాబాద్, ఏప్రిల్ 5,
బెంగళూరు డ్రగ్స్ కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి కుమారుడు,హైదరాబాద్ నగరానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్త ఉన్నారన్న ప్రచారం కలకలం సృష్టిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంతమంది నైజీరియన్లను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి.హైదరాబాద్‌కు చెందిన కలహర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కన్నడ నిర్మాత శంకర్ గౌడ్‌లు ఈ డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. వీరిని విచారించిన బెంగళూరు పోలీసులకు దిమ్మతిరిగే సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ డ్రగ్స్ దందాలో అధికారపార్టీకి చెందినప్రజాప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులకు సంబంధాలున్నాయని తేలింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఎప్పుడూ తన దగ్గరకు వచ్చేవారని .. డ్రగ్స్ కూడా తీసుకెళ్లేవారని సందీప్ చెప్పడంతో విచారణాధికారులు అలర్ట్ అయ్యారు. ఆ ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు,ఓ ఎమ్మెల్సీ డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు.గతంలో ప్రధాన నగరాల్లో డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారిలో ప్రజాప్రతినిధుల వారసుల పేర్లు బయటకొచ్చేవి. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుండటంతో కలకలం రేగుతోంది. హైదరాబాద్‌లో రాజకీయ అలజడికి కారణం అవుతోంది. కర్నాటకలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అధికార పార్టీ నేతలపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ మంత్రి కుమారుడితో పాటు ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా నేరుగా వచ్చి కొకైన్ తీసుకెళ్ళేవారని సందీప్ చెప్పాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సోదరుడి పాత్ర కూడా ఈ కేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే సోదరుడికి హైదరాబాదులో వ్యాపారాలు ఉన్నాయి. ఈ డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటారని తెలుస్తుంది. ఒక ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకొన్నారట. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ ఎపిసోడ్ నలుగురు ఎమ్మెల్యేల దగ్గరే ఆగుతుందో.. ఇంకా మరికొందరి పేర్లు జాబితాలో చేరతాయో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.