YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జానారెడ్డికి చావో...రేవో

జానారెడ్డికి చావో...రేవో

నల్గొండ, ఏప్రిల్ 5, 
నాగార్జునసాగర్ ఎన్నికలు.. ఆ ఇద్దరికీ సవాలేనా? చావో రేవోలా మారిందా? ఇన్నాళ్ల రాజకీయ జీవితాన్ని ఒకరు ఫణంగా పెట్టారా? ఈ పోరు పార్టీ భవితను కూడా తేల్చబోతుందా? కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత కె. జానారెడ్డికి, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం పరీక్షాకాలం నడుస్తోంది. మే 2న ఎవరి జాతకం ఏంటో తేలనుంది. దీనికి నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక వేదిక కానుండటం పార్టీలో రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్ఠానం పెద్దాయన్ని ఒప్పించి మరీ బరిలో దించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇటీవల కాలంలో ఇంకా ఇబ్బందిగా మారింది. 2023 ఎన్నికలకు శక్తిని కూడదీసుకోవాలంటే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో జానారెడ్డి తప్పక గెలవాలన్నది గాంధీభవన్‌ వర్గాల అభిప్రాయం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌కి విజయం దరిచేరలేదు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో నిలబడినా.. ఓటమే ఎదురైంది. అప్పటికే ఉత్తమ్ ఎంపీగా ఉండటంతో కాంగ్రెస్‌కి అంతగా వర్కవుట్‌ కాలేదు. ఆ తర్వాత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహకందని ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికలు సవాళ్లు విసురుతున్నాయి. పీసీసీ చీఫ్‌గా సుదీర్ఘకాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తమ్‌ ఆ పదవి నుంచి సాగర్‌ ఎన్నికల తర్వాత దిగిపోతారు. అలా దిగేముందు సాగర్‌లో గెలిచి ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. 2018 ఎన్నికల్లో సాగర్‌లో నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు జానారెడ్డి.  ఇప్పుడు ఉపఎన్నికలో తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఆయన టెస్ట్‌గా పెట్టారు.  ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనా.. ఈ దఫా మాత్రం తప్పక గెలవాల్సిన పరిస్థితి జానారెడ్డికి ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన సీనియర్‌ నాయకుడు. రేపటి రోజున కాంగ్రెస్‌ పుంజుకుంటే ఆయనే సీఎం అభ్యర్థి అన్న చర్చ తెరపైకి రావొచ్చు. టైమ్‌ బ్యాడ్‌గా ఉంటే అది ఆయన రాజకీయ భవిష్యత్‌పైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పొలిటికల్‌ స్క్రిన్‌పై జానారెడ్డి బొమ్మకు ఇంకా డిమాండ్‌ ఉందని చెప్పాలంటే సాగర్‌లో గెలవాల్సిందే అని గాంధీభవన్‌ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే.. ఒక్క పార్టీనే కాకుండా.. రాష్ట్రంలోని నాయకులంతా జానారెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. సాగర్‌లో ఆయన గెలిచి అసెంబ్లీకి వస్తే.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడం కాంగ్రెస్‌కే సాధ్యం అని చెప్పినట్టు అవుతుంది. ఆయన వల్ల పార్టీ నిలబడింది అన్న చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. వరస ఓటములతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌కు జానా గెలుపు టానిక్‌ అవుతుందని అనుకుంటున్నారు. అందుకే అందరూ ఈ నెల 17న జరిగే పోలింగ్‌.. మే 2న చేపట్టే ఓట్ల లెక్కింపుపై ఫోకస్‌ పెట్టారు. టీఆర్‌ఎస్సే కాదు.. బీజేపీ నుంచి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ముప్పు పొంచి ఉంది. దుబ్బాకలో గెలుపు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలనాథులు పుంజుకున్న తర్వాత కొంత గుబులు మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వెనకబడటంతో కాంగ్రెస్‌ నాయకులు కాస్త తేలిక పడ్డారట. ఇలాంటి సమయంలో సాగర్‌లో జానారెడ్డి గెలిస్తే రేస్‌లో ముందుకు రావొచ్చని అనుకుంటున్నారు. అందుకే అటు కాంగ్రెస్‌కు.. ఇటు జానారెడ్డికి నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక రూపంలో పెద్ద పరీక్ష కాలం ఎదురైందని గాంధీభవన్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి.. ఇక్కడ ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారో చూడాలి.

Related Posts