పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 8వ తేదీ తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం ఘనంగా జరుగనుంది. శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. కోవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
శ్రీ అన్నమాచార్య గురుపరంపరకు చెందిన శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ విచ్చేస్తారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రముఖ కళాకారులు, భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.