న్యూఢిల్లీ, ఏప్రిల్ 6,
కరోనా మహమ్మారి మళ్లీ చుట్టేస్తోంది. అందరినీ వణికిస్తోంది. దానికి అంతం లేదా? ఇప్పటికే పవర్ఫుల్ వ్యాక్సిన్లతో కరోనాపై సైంటిస్టులు వార్ను స్టార్ట్ చేశారు. కొన్నింటిని అమ్ములపొదిలో నుంచి బయటకు తీశారు. మరికొన్నింటికి పదును పెడుతున్నారు. ఇంకొన్నింటిని డిజైన్ చేసి పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఎన్ని? వాటి పనితనం ఎంత? త్వరలో రాబోయే వ్యాక్సిన్లు ఏవి? ఏయే వ్యాక్సిన్లు ఏయే దశల్లో ఉన్నాయో తెలుసుకుందాం..: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 269 కరోనా వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గుర్తించింది. అందులో 85 వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 184 వ్యాక్సిన్లు ప్రి క్లినికల్ ట్రయల్స్ (వ్యాక్సిన్ అభివృద్ధి) దశలో ఉన్నాయి. ఇన్ని వ్యాక్సిన్లున్నా ప్రస్తుతం ప్రపంచం వాడుతున్నది 13 వ్యాక్సిన్లే. అయితే అందులో కొన్నింటిని అనధికారికంగా కూడా వాడుతున్నారు. డబ్ల్యూహెచ్వో ప్రకారం 8 వ్యాక్సిన్లే ప్రస్తుతం జనానికి అందుబాటులో ఉన్నాయి. ఇండియా, అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా తయారు చేసిన టీకాలను వేస్తున్నారు. అందులోనూ ఎమర్జెన్సీ వాడకం కోసం ఇప్పటిదాకా మూడంటే మూడింటికే డబ్ల్యూహెచ్వో అనుమతిచ్చింది. మన దేశంలో భారత్ బయోటెక్ తర్వాత జైడస్, బయోకాన్ వంటి సంస్థలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటిదాకా 30 వరకు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్, ప్రి క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్టు ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్లను జనానికి ఇస్తున్నారు. వాటితో పాటు జైడస్ క్యాడిలా తయారు చేస్తున్న జైకొవ్డీ ఫేజ్3 ట్రయల్స్ దశలో ఉంది. బయోలాజికల్ ఈ తయారు చేస్తున్న మరో వ్యాక్సిన్ పై ఫేజ్1/2 ట్రయల్స్ నడుస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాజల్ (ముక్కు ద్వారా ఇచ్చే) వ్యాక్సిన్పైనా ఫేజ్1 ట్రయల్స్ నడుస్తున్నాయి. అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ తయారు చేసిన కొవోవ్యాక్స్పై మన దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ట్రయల్స్ చేస్తోంది. మూడో దశ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికీ సీరమ్ కంపెనీ ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అప్పటిదాకా మాస్కే మందు
వ్యాక్సిన్లు వచ్చాయన్న ధైర్యం కావొచ్చు.. మన దాకా వైరస్ రాదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కావొచ్చు.. చాలా మంది మాస్కులే పెట్టుకోవట్లేదు. సోషల్ డిస్టెన్స్నూ పాటించట్లేదు. కరోనా వ్యాక్సిన్లు వచ్చినా ఇప్పుడే అందరికీ అందవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరిదాకా అది చేరాలంటే ఇంకో ఏడాదైనా పట్టొచ్చు. అప్పటిదాకా కరోనాను ఎదుర్కొనే మందు, ఆయుధాలు మాస్క్, సోషల్ డిస్టెన్స్లే. ఈ బేసిక్ కరోనా రూల్స్పై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ జోరుమీదుంది. కాబట్టి అంతా మాస్క్ పెట్టుకుంటూ, కనీస దూరం పాటిస్తేనే మనల్ని మనం కాపాడుకోగలమని నిపుణులు చెప్తున్నారు. చివరిగా.. శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం కూడా మరచిపోవద్దు!
ఇప్పటివరకు 65.3 కోట్ల మందికే
ఇప్పటిదాకా 65.3 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. 16 కోట్ల 16 లక్షల 88 వేల 422 మంది వ్యాక్సిన్ వేసి అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది.ఆ తర్వాత చైనాలో 13 కోట్ల 80 లక్షల 10 వేల మందికి వ్యాక్సిన్ వేశారు. యూరోపియన్ యూనియన్లోని దేశాల్లో 7 కోట్ల 88 లక్షల 71 వేల 361 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 7.6 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన మన దేశం నాలుగో స్థానంలో ఉంది. బ్రిటన్లో 3.66 కోట్లు, బ్రెజిల్లో 2.37 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు.
కొవిషీల్డ్.. డబ్ల్యూహెచ్వో ఓకే
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ కలిసి తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఫార్ములా చేడాక్స్1 ఎన్కొవ్19. చింపాంజీల్లో ఫ్లూకు కారణమయ్యే అడినోవైరస్, కరోనా వైరస్లోని ఎస్(స్పైక్) ప్రొటీన్ను కలిపి తయారు చేసిన వ్యాక్సిన్ ఇది. ఫేజ్2, ఫేజ్3 క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఫేజ్3లో వివిధ దేశాలకు చెందిన 10 వేల మందిపై ట్రయల్స్. వ్యాక్సిన్ పనితనం 90 శాతంగా నమోదైంది. ఎమర్జెన్సీ వాడకం కోసం డబ్ల్యూహెచ్వో అనుమతిచ్చిన వ్యాక్సిన్లలో ఇదొకటి. మనదేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ను ప్రొడ్యూస్ చేస్తోంది. మన దేశంలో కొవిషీల్డ్ పేరుతో సీరమ్, బయటి దేశాల్లో వ్యాక్స్జెవ్రియా పేరుతో ఆస్ట్రాజెనికాలు మార్కెట్ చేస్తున్నాయి. ఒక్కోడోసుకు మన దేశంలో రూ.వెయ్యి. ప్రస్తుతం డబ్ల్యూహెచ్వో పరిశీలనలో ఫేజ్4 క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి.
కొవాగ్జిన్.. బూస్టర్ డోస్
డబ్ల్యూహెచ్వో నుంచి గుర్తింపు పొందిన మొదటి మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ఇది. ఇనాక్టివ్ (చచ్చిపోయిన) చేసిన వైరస్లోని కణంతో వ్యాక్సిన్ తయారీ. ఇనాక్టివ్ చేయడం వల్ల శరీరంలోకి వెళ్లినా వాటి సంఖ్య పెరగదు. దీంతో దాని వల్ల పెద్ద సమస్యలేవీ రావు. బయటి నుంచి వచ్చిన కణం కాబట్టి మన ఇమ్యూన్సిస్టం వెంటనే స్పందించి యాంటీ బాడీలను తయారు చేస్తుంది. హైదరాబాద్లోని భారత్ బయోటక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ఇంటరిం ఫలితాల్లో 81 శాతం పనితనాన్ని కనబరిచింది. రెండో దశకు సంబంధించిన ఫలితాల్లో మన వ్యాక్సిన్ 99.6 శాతం పనితనాన్ని చూపించింది. కరోనా మ్యుటేషన్లపైనా బాగా పనిచేస్తున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) పరిశీలనలో తేలింది. బ్రిటన్ రకం కరోనాపైనా దాని పనితనం 50 శాతానికిపైనే ఉన్నట్టు తేలింది. 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ల వద్ద వ్యాక్సిన్ను స్టోర్ చేయొచ్చు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే కొవాగ్జిన్కు ఇది పెద్ద అడ్వాంటేజ్. మంగోలియా, మయన్మార్, శ్రీలంక, ఫిలిప్పీన్స్, బహ్రెయిన్, మాల్దీవ్స్, మారిషస్లకు సరఫరా చేస్తోంది. 28 రోజుల తేడాతో రెండు డోసులుగా వ్యాక్సిన్ ఇస్తారు. రెండు డోసులు పూర్తయిన తర్వాత బూస్టర్ డోస్నూ ఇవ్వనున్నారు. బూస్టర్ డోసు ఇస్తే మూడు నాలుగేండ్ల పాటు కరోనా ఇమ్యూనిటీ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈమధ్యే దానిపై ప్రకటన విడుదల చేసింది. మోడర్నా .. కొత్త టెక్నాలజీ అమెరికాకు చెందిన మోడర్నా అనే కంపెనీ ‘ఎంఆర్ఎన్ఏ1273’ వ్యాక్సిన్ను తయారు చేసింది. మెసెంజర్ ఆర్ఎన్ఏ అనే కొత్త టెక్నాలజీతో తయారైన మరో వ్యాక్సిన్ ఇది. 30 వేల మందిపైన మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ చేశారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో 94.1 శాతం వరకు వ్యాక్సిన్ పనితనం చూపించిందని ఆ ట్రయల్స్ లో తేలింది. అన్ని వయసుల వారిలోనూ వ్యాక్సిన్ పనితనంలో ఎలాంటి తేడాల్లేవు. అమెరికా ప్రభుత్వం దీని వాడకానికి అనుమతులిచ్చింది. ఫైజర్ వ్యాక్సిన్ లాగానే దీనిని కూడా మైనస్ 80 డిగ్రీల నుంచి మైనస్ 60 డిగ్రీల టెంపరేచర్ల వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది.
జాన్సన్ అండ్ జాన్సన్.. ఒక్కటే డోస్ అమెరికాకే చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ ఏడీ26కొవ్2ఎస్ పేరిట కరోనా వ్యాక్సిన్ను తయారు చేసింది.
వైరల్ వెక్టార్ టెక్నాలజీ ఆధారంగా టీకాను డెవలప్ చేసింది. అడినోవైరస్లోని టైప్26ను తీసుకుని దానిని కరోనా వైరస్లోని స్పైక్ ప్రొటీన్తో కలిపి తయారు చేసింది. మిగతా వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇస్తే.. దీనిని ఒకే డోసు కింద ఇస్తారు. అదే ఈ వ్యాక్సిన్ స్పెషాలిటీ. 43 వేల మందిపై చేసిన మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో 85 శాతం పనితనాన్ని చూపించింది. మరణాలను 100 శాతం వరకు తగ్గించగలిగింది. డబ్ల్యూహెచ్వో అనుమతించిన వ్యాక్సిన్లలో దీనికీ చోటు దక్కింది. ఫైజర్.. పనితనంలో బెస్ట్ జర్మనీకి చెందిన బయోఎన్టెక్తో కలిసి అమెరికా కంపెనీ ఫైజర్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఫార్ములా బీఎన్టీ162బీ2. ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎన్ఏ) టెక్నాలజీ ఆధారంగా దీనిని తయారు చేశారు. కరోనా వైరస్లోని స్పైక్ ప్రొటీన్ను గుర్తించేలా ఎంఆర్ఎన్ఏను ఎన్కోడ్ చేసి వ్యాక్సిన్కు రూపునిచ్చారు. 43 వేల మందిపై ఫేజ్3 ట్రయల్స్ చేశారు. వ్యాక్సిన్ పనితనం 95 శాతంగా నమోదైంది. 65 ఏళ్లకు పైబడినోళ్లలోనూ 94 శాతం పనితనాన్ని వ్యాక్సిన్ చూపించింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో తయారు చేయడం వల్ల దీనిని మైనస్80 డిగ్రీల టెంపరేచర్లో స్టోర్ చేయాల్సిన అవసరముంది. ప్రస్తుతం అమెరికాలో ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులు పొందిన వ్యాక్సిన్లలో ఇదొకటి. మన దేశంలోనూ వాడకం కోసం అప్లై చేసుకున్నా.. తర్వాత ఎందుకో వాపస్ తీసుకుంది. కొమిర్నాటీ పేరుతో వ్యాక్సిన్ను మార్కెట్ చేస్తోంది. ఎమర్జెన్సీ వాడకానికి డబ్ల్యూహెచ్వో అనుమతిచ్చింది. స్పుత్నిక్.. వరల్డ్లో ఫస్ట్ టీకా ప్రపంచంలో రిజస్టర్ అయిన మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్Vనే. వైరల్ వెక్టర్ టెక్నాలజీ ఆధారంగా రష్యా ప్రభుత్వ సంస్థ గమాలియా రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్ ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. కరోనా వైరస్లోని ఎస్ ప్రొటీన్ను అడినోవైరస్లతో కలపి ఆర్ఏడీ26, ఆర్ఏడీ5 అనే డోసులుగా వ్యాక్సిన్ను చేశారు. 40 వేల మందిపై మూడో ఫేజ్ ట్రయల్స్ చేశారు. 91.6 శాతం పనితనాన్ని వ్యాక్సిన్ చూపించిందని రష్యా చెబుతోంది. 2 నుంచి 8 డిగ్రీల వద్ద స్టోర్ చేసుకోవచ్చు.
మన దేశంలో ఆ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీతో రష్యా ఒప్పందం చేసుకుంది. వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి రెడ్డీస్ అప్లై చేసింది. జర్మనీ, ఫ్రాన్స్లు స్పుత్నిక్ వ్యాక్సిన్ను కొనేందుకు చర్చలు జరుపుతున్నాయి. 1957లో రష్యా పంపిన తొలి ఉపగ్రహం స్పుత్నిక్ పేరునే వ్యాక్సిన్కూ పెట్టారు. సైనోఫార్మ్.. చైనాకే చెందిన మరో సంస్థ సైనోఫార్మ్.. బీబీఐబీపీ కొర్వీ అనే టీకాను తయారు చేసింది. కరోనావ్యాక్ లాగానే ఇదీ ఇనాక్టివేటెడ్ వ్యాక్సినే. బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయాలాజికల్ ప్రొడక్ట్స్, చైనా నేషనల్ బయాలాజికల్ గ్రూప్ సీఎన్బీజీ– సైనోఫోర్మ్)లు కలిసి దానిని డెవలప్ చేశాయి. దీనికి సంబంధించిన ఎఫికసీ డేటానూ చైనా అధికారికంగా ప్రకటించలేదు. యూఏఈలో 60 వేల మందిపై ట్రయల్స్ చేస్తే.. 86 శాతం పనితనాన్ని చూపించినట్టు ఆ దేశం ప్రకటించింది. సైనోవ్యాక్ ‘కరోనావ్యాక్’ వైరస్ పుట్టిన చైనాలో తయారైన ఫస్ట్ వ్యాక్సిన్ ఇది. ఇనాక్టివేటెడ్ వైరస్ టెక్నాలజీతో సైనోవ్యాక్ కంపెనీ ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. వైరస్ను తీసుకుని దానిని ఇనాక్టివ్ చేసి వ్యాక్సిన్ను డెవలప్చేసింది. 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ వద్ద దీనిని స్టోర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ పనితనం, దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి చైనా ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. బ్రెజిల్లో 78%, టర్కీలో 83.5%, ఇండోనేషియాలో 65.3 శాతం వరకు ఫలితాలొచ్చినట్టు ఆ దేశాలు ప్రకటించాయి.
మరికొన్ని...
ఆ 8 వ్యాక్సిన్లే కాకుండా మరో ఐదు వ్యాక్సిన్లనూ ప్రపంచంలోని రెండు మూడు దేశాలు వాడుతున్నాయి. రష్యా ఫెడరల్ బడ్జెటరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ తయారు చేసిన ఎపివ్యాక్ కరోనా, చైనా కాన్సినో బయాలాజిక్స్ చేసిన ఏడీ5ఎన్కొవ్ వ్యాక్సిన్, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ తయారు చేసిన మరో ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్, రష్యా తయారు చేసిన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ కొవివ్యాక్, చైనా–ఉజ్బెకిస్థాన్ కలిసి తయారు చేసిన జెడ్ఎఫ్2001 వ్యాక్సిన్లను ఇప్పటికే ఆయా దేశాల్లో వాడుతున్నారు.