YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్..గేమ్ ఛేంజర్ అవుతుందా

సాగర్..గేమ్ ఛేంజర్ అవుతుందా

నల్గొండ, ఏప్రిల్ 6, 
నాగార్జున సాగర్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా మారబోతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ , బీజేపీలకు ఈ ఎన్నిక లిట్మస్ టెస్ట్‌గా మారింది. గెలుపు అవకాశాలు ఉన్నాయని ఓ వైపు గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తేనే మళ్లీ… తెలంగాణలో కాంగ్రెస్ పోటీ పడగలిగే స్థితిలో ఉంటుందనేది అందరూ అంగీకరించే నిజం. అందుకే మిగతా పార్టీల కన్నా… నాగార్జున సాగర్ .. ఇప్పుడు కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. కానీ వడ్డించిన విస్తరిని ముందు పెట్టినా చిందరవందర చేసుకునే మనస్థత్వం కాంగ్రెస్ నేతలది. ఇప్పుడు… సాగర్ విషయంలో ఏం చేస్తారోనన్నది ఆసక్తికరం. నాగార్జున సాగర్ ఉపఎన్నిక … టీఆర్ఎస్ కు కూడా కీలకమే. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందన్న ప్రచారం పూర్తిగా తగ్గాలంటే సాగర్‌లో గెలవాలి. అందుకే ఆరు నూరైనా సాగర్ టీఆర్ఎస్ ఖాతాలో పడాల్సిందేనని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసి పంపించారు. సిట్టింగ్ సీటు అయినా … గెలిస్తే..టీఆర్ఎస్‌కు వచ్చే మైలేజీ వేరుగా ఉంటుంది. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న అధికార వ్యతిరేకత అనేది మటుమాయం అవుతుంది. మళ్లీ టీఆర్ఎస్‌కు గత వైభవం వస్తుంది. దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాల ప్రభావం పూర్తిగా కనుమరుగు అవుతుంది. అందుకే.. నాగార్డున సాగర్ ను టీఆర్ఎస్ … ఎప్పుడూ లేనంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీకి కూడా సాగర్ ఉపఎన్నిక చావో రేవో అన్నట్లుగా మారింది. దుబ్బాక తర్వాత గ్రేటర్‌లో మంచి ఫలితాలు సాధించి.. ఇక సీఎం సీటే మిగిలిందన్నట్లుగా ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా సాగర్‌లో ఇప్పుడు ప్రభావం చూపించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయం అని ఇప్పటి వరకూ ఎలుగెత్తి చాటుతున్న భారతీయ జనతా పార్టీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో వచ్చిన హైప్ అంతా.. ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటును కోల్పోవడం నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడో నాలుగో స్థానంలో ఉండిపోవడంతో చల్లబడిపోయినట్లయింది. ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక ద్వారా.. మళ్లీ బీజేపీ తనను తాను మరోసారి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి ఉంది. అక్కడ ప్రభావం చూపిస్తే.. పెద్ద ఎత్తున మళ్లీ ప్రత్యామ్నాయం అనే ప్రచారం లభిస్తుంది. లేకపోతే.. ఏమీ ఉండదు.
అందుడాటులోని నేతలు
ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు కొంత మందికి అందుబాటులో ఉండటంలేదు. ప్రధానంగా స్థానిక నాయకత్వానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలలో ధైర్యం అనేది కనబడటంలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో కొంతమంది నేతలు అందుబాటులో లేకపోవడం ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారింది.ఆ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మృతి తర్వాత చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇక నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో స్పష్టత లేక చాలా మంది దూరంగా ఉన్నారు. ఇక ప్రజల్లోకి వెళ్ళే నేతలు టికెట్ కోసం హైదరాబాదు లోనే ఎక్కువగా ఉండటంతో చాలా వరకు కూడా ఆసక్తికర చర్చలు జరిగాయి.దీనితో రాజకీయంగా ఇప్పుడు పరిస్థితులు కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ మీద గట్టిగా ఫోకస్ చేసి పాదయాత్రలు చేస్తున్నది. టిఆర్ఎస్ పార్టీ నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన నెలకొంది. పరిస్థితులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అవుతాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధానం ఎంత మాత్రం కరెక్ట్ కాదని ప్రజల్లోకి వెళ్లకపోతే పార్టీ ఓటమి పాలైన సరే ఆశ్చర్యం లేదని అంటున్నారు.

Related Posts