YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

సింగరేణి పరిరక్షణ ఎలా

సింగరేణి పరిరక్షణ ఎలా

కరీంనగర్, ఏప్రిల్ 6  
కరోనా మహమ్మారి సింగరేణి కార్మికులను సైతం భయపెడుతున్నది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బొగ్గు గనులను నడుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 28 భూగర్బ గనులు, 19 ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో దాదాపు 50 వేల మంది కార్మికులు, ఇతర ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో గనులను మూసేయాలని ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అండర్‌ గ్రౌండ్‌ గనులకు లే ఆఫ్‌ ప్రకటించి, ఓపెన్‌ కాస్ట్‌ గనులను యధావిధిగా నడుపుతున్నది. తాముంటున్న ప్రదేశాలు, పని చేసే క్షేత్రాలు సామూహికంగా ఉండడంతో కార్మికులకు వ్యాధి అంటుకుంటే వేగంగా వ్యాపించి భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.సింగరేణిలో ఉన్న మూడు మిలియన్‌ టన్నుల బొగ్గు తాను సరఫరా చేస్తున్న విద్యుత్‌ సంస్థలకు రెండు నెలల పాటు సరి పోనుంది. లాక్‌ డౌన్‌ రెండు నెలలు సాగినా విద్యుత్‌ సంస్థలకు కావాల్సిన బొగ్గు సరఫరాకు ఎలాంటి అవాంతరాలు వచ్చే అవకాశం లేదు. అయినా యాజయాన్యం మొండిగా వ్యవహరిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి గనులను నడిపిస్తున్నదని కార్మికులంటున్నారు. యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 15 నుంచి సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు ఇప్పటికే నోటీసిచ్చాయి. అయినా యాజమాన్యం కేవలం భూగర్బ గనులకే లే ఆఫ్‌ ప్రకటించి సింగరేణి వ్యాప్తంగా ఉన్న 19 ఓపెన్‌ కాస్ట్‌ గనులను యధావిధిగా నడపాలని నిర్ణయించింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి సామాజిక దూరం తప్ప మార్గం లేదని పదే పదే ప్రకటించినప్పటికీ యాజమాన్యం లాక్‌ డౌన్‌ ప్రకటించం లేదు. కరోనా ప్రబలకుండా తగిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్‌ జనరల్‌ మైన్స్‌, సేఫ్టీ (డీజీఎంఎస్‌) అధికారులు ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి సర్క్యులర్‌ జారీ చేసినా ఎలాంటి చర్యలు చేపట్టక పోవడాన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.లేఆఫ్‌ను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లే ఆఫ్‌తో తాము సగం జీతాన్ని నష్ట పోతామని కార్మికులంటున్నారు. అలాగే తమను సంప్రదించకుండానే జీవో నంబరు 27ను తమకు వర్తింప జేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.మనుషుల ప్రాణాల కన్నా ఈ ప్రపంచంలో ఏది విలువైంది కాదు. వేలాది మంది కార్మికుల జీవితాలను ఫణంగా పెట్టి బొగ్గు, గనులు నడపడం సరి కాదు. కార్మికులు, అధికారులు, ఉద్యోగులు అనే తరతమ భేదం లేకుండా మొత్తం సింగరేణి సంస్థను లాక్‌ డౌన్‌ చేయాలి. కరోనా దెబ్బకు మొత్తం ప్రపంచమే అప్రమత్తమైంది. వాస్తవ పరిస్థితిని అంచనా వేయకుండా మొండిగా వ్యవహరించడం మానుకోవాలి. దేశ అవసరాల కోసం తప్పదనుకుంటే డీజీఎం, వైద్యాధికారుల సూచనలతో తగిన రక్షణ చర్యలు తీసుకుని ఓపెన్‌ కాస్ట్‌ గనులను డబుల్‌ మాస్టర్‌ విధానం కింద నడపాలి.

Related Posts