న్యూ ఢిల్లీ ఏప్రిల్ 6
ఇండియా దిగుమతులపై నిషేధం విధించిన పాకిస్థాన్‌లో ఇప్పుడు చక్కెర ధర 100 పాకిస్థాన్ రూపాయలకు చేరింది. దాయాది దేశం నుంచి దిగుమతులు చేసుకోకపోవడంతో అక్కడ చక్కెరకు కొరత ఏర్పడింది. తాజాగా ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (టీసీపీ) 50 వేల టన్నుల చక్కెర దిగుమతులకు గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఇందులో ఇండియా పేరు లేదు. ఇది పాకిస్థాన్ దురదృష్టమంలూ భారత చక్కెర పరిశ్రమ అనడం గమనార్హం. గతంలోనూ ఈ టెండర్లు పిలవగా.. ధర చాలా ఎక్కువగా ఉండటంతో వాటిని రద్దు చేసింది. ఇప్పుడు చక్కెరకు తీవ్ర కొరత ఏర్పడటంతో మరోసారి టెండర్లు పిలవక తప్పలేదు.గత వారం ఇండియా నుంచి చక్కెర, పత్తి దిగుమతులకు పాకిస్థాన్ ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. పాక్ కేబినెట్ మాత్రం అంగీకరించలేదు. ఇండియా, ఇజ్రాయెల్‌లాంటి నిషేధిత దేశాల నుంచి మాత్రం తమకు కార్గోను సరఫరా చేయవద్దని ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ తాజా టెండర్లలో స్పష్టం చేసింది. దీనిపై ఆలిండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలానీ స్పందించారు. ఇది పాకిస్థాన్ దురదృష్టం. ఇండియా షుగర్ కంటే తక్కువ ధర, నాణ్యత, వేగంతో మిగతా వాళ్ల నుంచి చక్కెర పొందగలరా అని ఆయన ప్రశ్నించారు.ఇతర దేశాల కంటే పాకిస్థాన్‌కు ఇండియా నుంచే చాలా వేగంగా, చౌకగా చక్కెర దిగుమతి చేసుకోవచ్చు. పంజాబ్ మీదుగా ఈ కార్గో పాక్‌కు చేరుతుంది. ఇండియా నుంచి టన్నుకు కేవలం 398 డాలర్లు మాత్రమే అవుతుండగా.. ఇప్పుడు పాక్ మాత్రం కనీస బిడ్‌గా 540 డాలర్లు అందుకోవడం గమనార్హం.