న్యూఢిల్లీ ఏప్రిల్ 6
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, 18 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇచ్చే విధంగా అనుమతి ఇవ్వాలని ఐఎంఏ ఇవాళ తన లేఖలో కోరింది. వాక్ ఇన్ కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలని ఐఎంఏ తన లేఖలో పేర్కొన్నది. దేశంలో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉందని, అందుకే యుద్ధ ప్రాతిపదికను టీకాలు ఇవ్వాలని కోరింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేసేందుకు తమ యంత్రాంగం మొత్తం నిర్విరామంగా కృషి చేస్తుందని, అందుకే 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఐఎంఏ సూచన చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను తప్పనిసరి చేయాలని కోరారు. వైరస్ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో నిత్యావసరం కానటువంటి సినిమాలు, సాంస్కృతి, మతపరమైన కార్యక్రమాలు, క్రీడలను రద్దు చేయాలని ఐఎంఏ తన లేఖలో తెలిపింది.