విజయనగరం
ఛత్తీస్గఢ్ మావోయిస్టుల కాల్పుల్లో అమరుడైన జవాన్ జగదీష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.జవాన్ భౌతికకాయం విజయనగరం జిల్లా గాజులరేగలో స్వస్వగృహానికి తీసుకొచ్చారు. జగదీష్ను కడసారి చూసేందుకు స్థానికులు, బంధువులు భారీగా తరలివచ్చారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు నివాళు అర్పించారు. గాజులరేగలో జగదీష్ స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. జోహార్ జగదీష్ అంటూ నినాదాలు చేస్తూ.. స్థానికులు పూల వర్షం కురిపించారు. గాజులరేగ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో జగదీష్ అంత్యక్రియలు నిర్వహించారు.
విజయనగరం గాజులరేగ ఎగువవీధికి చెందిన రౌతు సింహాచలం, రమణమ్మల కుమారుడు జగదీష్ సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. మే 22న జగదీష్కు వివాహం నిర్ణయించారు.. ఈ నెల 5న పెళ్లి పనులు చూసుకునేందుకు ఇంటికి రావాలనుకున్నాడు. రెండురోజల కిందటే తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పాడు.. కానీ జగదీష్ మరణం ఇంతలోనే తీవ్ర విషాదం నింపింది. ఆయన మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.