YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

యాసంగిలో పెరిగిన సాగు

యాసంగిలో పెరిగిన సాగు

యాసంగిలో పెరిగిన సాగు
నిజామాబాద్, ఏప్రిల్ 7,
కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాలు మరో కోనసీమను తలపిస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతలతో సాగునీరు అందడంతో గ్రామాలు ఎటు చూసినా పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు కేవలం వానకాలంలో మాత్రమే పంటలు సాగు చేసేవారు. యాసంగిలో పంటలు సాగు చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంతో కేఎల్‌ఐ నీరు గ్రామాలకు చేరుకున్నది. దీంతో గ్రామాల చుట్టూ ఉన్న చెరువులు నిండి అలుగు పారాయి. దీంతో యాసంగిలోనూ అన్నదాత వరి పంట సాగు చేస్తున్నారు. పొలాలు కౌలుకు ఇచ్చి వెళ్లిన వారు ఇప్పుడు స్వయంగా పంటలను సాగు చేస్తున్నారు. చెరువులు, కత్వలలోకి కేఎల్‌ఐ నీరు రావడంతో భూగర్భజలాలు పెరిగి బోర్లు కూడా పనిచేస్తున్నాయి. రెండేండ్ల కిందట డిసెంబర్‌, జనవరి నాటికి అడుగంటిన చెరువులు నేడు నీటితో కళకళలాడుతున్నాయి. రఘుపతిపట దుందుభీ దెమ్మ వద్ద ఇప్పటికీ నీరు పారుతుండడంతో పరిసర ప్రాంత రైతులు యాసంగిలోనూ వరి, వేరుశనగ పంటలు సాగు చేశారు. కొన్నిచోట్ల నీటి లభ్యతను బట్టి మూడో పంట కూడా వేసేందుకు సిద్ధమయ్యారు. మండలంలో దాదాపు 25వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, స్వల్పకాలిక పంటలను సాగుచేస్తున్నారు. కేఎల్‌ఐ ద్వారా బీడు భూములకు సాగునీరు అందించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.కల్వకుర్తి మండలంలో 24 గ్రామాల్లో 43వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. రెండేండ్ల కిందట చాలా మంది రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. చాలా తక్కువమంది పొలాల్లోనే బోర్లు ఉండేవి. రెండో పంట సాగు చేసేందుకు రైతులు జంకేవారు. వర్షాలు సమృద్ధిగా లేక, భూగర్భజలాలు అడుగంటడంతో ఒక్క పంటతోనే సరిపెట్టుకునేవారు. కేఎల్‌ఐ నీటి రాకతో మండలం రూపురేఖలు మారిపోయాయి. బీడుభూముల్లో సైతం నేడు రైతన్న సాగు మొదలుపెట్టాడు. ఎటు చూసినా పచ్చని పంటపొలాలతో మండలం మరో కోనసీమను తలపిస్తున్నది. వానకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్నలు, చిరుధాన్యాలను సాగుచేసిన రైతులు యాసంగిలోనూ వేరుశనగ సాగు చేస్తున్నారు. కేఎల్‌ఐ రాక మునుపు యాసంగిలో రెండువేల ఎకరాల్లో సాగు చేస్తుండగా ప్రస్తుతం లెక్కలు మారిపోయాయి. దాదాపు 24,897 ఎకరాలకుపైగా సాగు చేస్తున్నారు. వరి 13,504ఎకరాల్లో, 11,050 ఎకరాల్లో వేరుశనగ మరో 300 ఎకరాల్లో స్వల్పకాలిక పంటలను పండిస్తున్నారు. దీంతోపాటు కలంగిరి(పుచ్చకాయ)పంటను కూడా సాగుచేస్తున్నారు.

Related Posts