విశాఖపట్టణం, ఏప్రిల్ 7,
విశాఖపట్నం నగరంలోని మిందిలో ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ప్రైవేట్ గోడౌన్‌ను రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు బుధవారం కూల్చివేశారు. ఇవి, అనుమతి లేని నిర్మాణాలని అధికారులు చెబుతుండగా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని గోడౌన్ యజమానులు అంటున్నారు. మిందిలో ఏపీఐఐసీకి చెందిన స్థలాన్ని గతంలో రాయుడు అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. వారి నుంచి ఈ స్థలాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం లీజుకు తీసుకుంది. ఈ తరుణంలో బుధవారం అధికారులు ఎవరిని లోపలకు అనుమతించకుండా గోడౌన్‌ను కూల్చివేశారు.అయితే, ఏపీఐఐసీ అధికారులు మాత్రం.. ఈ స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తికి ఇచ్చామని.. కానీ, ఇక్కడున్నవి అనుమతి లేని కట్టడాలని చెప్పారు. కాగా, ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి దాదాపు ఐదేళ్లయింది. దీనికి సంబంధించి అన్ని అనుమతులు గత టీడీపీ ప్రభుత్వం నుంచి తీసుకున్నట్లు ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెబుతోంది.కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెబుతుండగా.. గోడలపై నోటీసులు అందింటిచినట్లు అధికారులు అంటున్నారు. గోడపై 2020 డిసెంబర్ 15న ఒకటి, 2021 ఫిబ్రవరి 25న ఇంకొక నోటీసు పెట్టినట్లు ఉంది. కానీ, నాలుగు రోజుల క్రితమే విశాఖలో భారీ వర్షం కురిసిందని, వర్షానికి కూడా నోటీసులు చెక్కుచెదరకుండా ఉన్నాయంటే.. ఈ నోటీసులు ఓ ప్లాన్ ప్రకారం తేదీలు వేసి గోడలకు అంటించారని వారు చెబుతున్నారు. మొన్న రాత్రి అధికారులు వచ్చి గోడలకు నోటీసులు అంటించి వెళ్లారని అంటున్నారు. సమయం ఇవ్వాలని అధికారులను అడిగినా పట్టించుకోకుండా గోడౌన్‌ను కూల్చివేశారని స్థానిక సిబ్బంది ఆరోపిస్తున్నారు.