చంద్రబాబు సొంత జిల్లా.. చిత్తూరులో పార్టీ పరిస్థితి ఏంటి? టీడీపీ హవా ఎలా నడుస్తోంది ? వంటి అనేక విషయాలను చర్చించినప్పుడు ఆసక్తికర అంశం వెలుగు చూస్తుంది. ఇక్కడ, పార్టీల బలాలు కన్నా.. వ్యక్తులకే ప్రజలు పట్టం కడుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు కూడా వ్యక్తుల హవానే పనిచేస్తోంది. దీంతో ఇక్కడ టీడీపీ ఆశించిన రీతిలో సీట్లను కైవసం చేసుకోలేక పోతోంది. జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో కుప్పం, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, చిత్తూరు, తిరుపతి వంటి మొత్తం 6 చోట్ల నుంచి మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే 2004, 2009 ఎన్నికల్లోనూ ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ తేలిపోయింది.30 ఏళ్లుగా పీలేరులో పట్టు కోసం టీడీపీ నానా తంటాలు పడుతో్ంది నగరిలో కాకలు తీరిన రాజకీయ నేత, ఇటీవల మృతి చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై వైసీపీ అభ్యర్థి రోజా విజయ దుందుభి మోగించారు. ఇక, జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగరడం లేదంటే ఆశ్చర్యం అనిపిం చకపోదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా 2009లో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న వాయల్పాడు రద్దు కావడంతో కిరణ్ ఈ నియోజకవర్గానికి మారారు. అప్పటి వరకు ఇక్కడ వరుసగా గెలుస్తోన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు మారారు. టీడీపీ విజయం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. అంతేకాదు, పీలేరు నియోజకవర్గాన్ని దాదాపు వదిలేసుకున్న ఖాతాలోనే టీడీపీ వేసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడ అంత వీజీకాదనే విషయం నిశ్చయం అయిపోయింది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇక్కడ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పీలేరు నియోజకవర్గంలో బలంగా ఉన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు.పార్టీని బలోపేతం చేసుకోవడంతోపాటు.. పార్టీని గెలిపించుకోవాలని కూడా బాబు ఆశలు పెట్టుకున్నారు. కిశోర్‌కు మరో కీలక పదవికి ప్రమోషన్ కూడా ఇస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ఈ రెండు వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా పార్టీకి దూరంగా వెళ్లిపోయిన వారిని కూడా దగ్గరకు చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ బలోపేతం అవుతుందని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు ఓటములు మాత్రం ఇప్పటికిప్పుడు నిర్ణయించలేమని కూడా వారు పేర్కొంటుండడం గమనార్హం. అయితే ఇక్కడ నల్లారి ఫ్యామిలీకి వ్యక్తిగతంగా ఉన్న ఓటు బ్యాంకుకు టీడీపీ ఓటు బ్యాంకును సమన్వయం చేస్తే ఇక్కడ మూడు దశాబ్దాల తర్వాత పసుపు జెండా ఎగిరే ఛాన్సులు ఉన్నాయి.ఇటీవల ఆయనకు నామినేటెడ్ పదవిని కూడా కట్టబెట్టారు. నిజానికి ఈ నియోజ కవర్గంలో టీడీపీకి నాయకత్వ కొరత వెంటాడుతోంది. అంతేకాదు, పార్టీలో నేతలు ఇక్కడ రెండు వర్గాలుగా ఏర్పడి పార్టీని బలోపేతం కాకుండా చేశారనే వాదనా ఉంది. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నల్లారి కిశోర్‌కు బాధ్యతలు అప్పగించారు.