పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ ఏమాత్రం ఇబ్బందిలేకుండా దేశాలు తిరిగేస్తున్నాడు. భారత ప్రభుత్వం గత ఫిబ్రవరిలోనే నీరవ్ పాస్‌పోర్టు రద్దు చేసినా.. అతడు అడ్డూ అదుపు లేకుండా తన పర్యటనలు కొనసాగిస్తుండటం శోచనీయం. లండన్ నుంచి మాయమైనట్లు భావిస్తున్న నీరవ్.. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.బ్యాంక్ ఫ్రాడ్ విషయంలో సీబీఐ విచారణ ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందే నీరవ్ మోదీ దేశం దాటి వెళ్లిపోయాడు. జనవరి మొదటి వారంలో అతడు ముంబై నుంచి దుబాయ్ వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం ఫిబ్రవరిలో అతడి పాస్‌పోర్టును రద్దు చేశారు.భారత ప్రభుత్వం నీరవ్ పాస్‌పోర్టును రద్దు చేసినా ఆయా దేశాలకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే.. పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కారణంగానే నీరవ్.. దుబాయ్ నుంచి హాంకాంగ్, అక్కడ నుంచి లండన్.. తాజాగా న్యూయార్క్ చెక్కేశాడు. అతణ్ని భారత్ రప్పించడానికి ఇక్కడి అధికారులు నానా యాతన పడుతుంటే.. అతడు మాత్రం ఎంచక్కా దేశాలు తిరుగుతూ ముప్పుతిప్పలు పెడుతున్నాడు.