నల్గొండ, ఏప్రిల్ 8,
పోటీ ప్రపంచంలో నెట్టుకురావడానికి ఎంబీఏ చదివినా.. చాలీచాలని జీతాలకు పని చేయడం కంటే స్వశక్తిని మించినది లేదని బలంగా విశ్వసించాడు. కులవృత్తిని మించిన దైవం లేదని పల్లెబాట పట్టాడు. మట్టినే నమ్ముకొని నూతన ఆవిష్కరణలు చేస్తూ మట్టిలో మాణిక్యంలా మెరుస్తున్న ఆయన పేరు చిలువేరు లింగస్వామి. సంస్థాన్‌నారాయణపురం గ్రామానికి చెందిన లింగస్వామి కుండల తయారీలో మాస్టర్ ట్రైనర్‌గా ఇప్పటి వరకు 50 మందికి శిక్షణ ఇచ్చాడు. ఒక పక్క కుల వృత్తిని నామోషీగా భావించి పల్లెలను వదిలి పట్టణాల్లో ఐదారువేలకే ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. కానీ ఎంబీఏ పూర్తి చేసి పోటీ పరీక్షలకు హాజరైనా సరైన ఉద్యోగం రాలేదు. అయినా బాధపడకుండా వారసత్వంగా వస్తున్న.. తనకు ఇష్టమైన మట్టి కుండల తయారీనే జీవనోపాధిగా ఎంచుకుని మట్టితో భిన్నమైన ఆకృతులు తయారు చేస్తూ నెలకు రూ.15 నుంచి రూ.20వేల వరకు సంపాదిస్తూ కులవృత్తిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు సంస్థాన్‌నారాయణపురం గ్రామానికి చెందిన చిలువేరు లింగస్వామి. మట్టితో కేవలం ఐదు నిమిషాల్లో వంట సామగ్రికి సంబంధించిన మట్టి పాత్రలు, వినాయక విగ్రహాలు, జంతువులు, పక్షులు, దేవుడి బాండువలు తయారు చేయడం లింగస్వామి ప్రత్యేకత. మాస్టర్ ట్రైనర్‌గా మారి 50మంది వరకు మట్టి కుండల తయారీలో శిక్షణ ఇచ్చాడు. ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించిన వస్తువులు తయారు చేస్తుండటంతో చుట్టు పక్కల మండలాలతో పాటు హైదరాబాద్, ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు వచ్చి అతడి వద్ద కొనుగోలు చేస్తుంటారు. లింగస్వామి ఇంట్లో వండుకోవడానికి, తినడానికి మట్టి పాత్రలనే ఉపయోగిస్తాడు.సంస్థాన్ నారాయణపురం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన చిలువేరు సోమయ్య-యాదమ్మ దంపతుల కుమారుడు లింగస్వామి. చిన్నతనం నుండే చదువులో రాణిస్తుండటంతో తల్లిదండ్రలు కూలీ పనులు, మట్టి కుండలు తయారు చేస్తూ కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కష్టం వృథా చేయకుండా నారాయణపురం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి, ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నిజాం కాలేజీ, ఎంబీఏ అన్నమాచార్య ఇనిస్టిట్యూట్‌లో పూర్తి చేశాడు. ఎంబీఏ పూర్తయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసి సరైన ఉద్యోగం రాకపోవడంతో చిన్నతనం నుంచి తనకు అలవాటైన, ఇష్టమైన వారసత్వంగా వస్తున్న కుల వృత్తిలో రాణించాలని నిర్ణయించుకున్నాడు.గ్రామంలో తనకున్న వ్యవసాయ బావి వద్ద మట్టి కుండలను తయారు చేస్తూ వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. మట్టితో ఎలాంటి ఆకృతులైనా తయారు చేయడం లింగస్వామికి చిన్నప్పటి నుంచి అలవాటు. పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి భూదాన్‌పోచంపల్లిలోని శ్రీరామానందతీర్థ చేతివృత్తుల శిక్షణ శిబిరంలో మాస్టర్ ట్రైనింగ్‌లో చేరి మట్టి పాత్రలు, భిన్నమైన ఆకృతులు తయారు చేయడంలో మెలకువలను నేర్చుకున్నాడు. మాస్టర్ ట్రైనర్‌గా మారి 50 మంది వరకు మట్టి కుండల తయారీలో శిక్షణ ఇచ్చాడు. అతడి దగ్గర నేర్చుకున్న చాలా మంది కులవృత్తుల్లో రాణిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఐదు నిమిషాల్లో మట్టితో ఎలాంటి ఆకృతినైనా తయారు చేయడం లింగస్వామి ప్రత్యేకత. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తే మట్టితో కొత్త ఆవిష్కరణలు చేస్తానని, సబ్సిడీపై ఆధునిక యంత్రాలు అందజేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటానంటున్నాడు.వంట సామగ్రికి సంబంధించిన మట్టి ప్లేట్లు, అన్నం, కూరగాయలు వండే పాత్రలు, టీ కప్పులు, హాట్ బాక్స్‌లు, నీళ్ల జగ్గులు, వాటర్ గ్లాసులు, వాటర్ బాటిళ్లు, చిన్న పిల్లలకు బొడ్డు గురుగులు, దేవతల విగ్రహాలు, ఎల్లమ్మ పండుగలకు సంబంధించిన బాండువలు, వివిధ రకాల ప్రమిదలు, గీత కార్మికుల కుండలు, బోనాల కుండలు, మట్టి ఫ్రిజ్‌లు, పలు రకాల వస్తువులు తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. మట్టితో భిన్నమైన ఆకృతులు తయారు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.