న్యూఢిల్లీ ఏప్రిల్ 8
ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ విచారణ జరిపారు. ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈ నెల 30న తదుపరి విచారణ జరగనుంది. కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తున్న ప్రచారకులను డీబార్ చేయాలని పిటిషన్‌లో విక్రమ్ సింగ్ కోరారు. ఎన్నికల ప్రచారాల్లో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా ఎన్నికల సంఘం డిజిటల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని కూడా ఆయన కోరారు. మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారాలను మాత్రం ఎందుకు మినహాయించాలని ఆయన ప్రశ్నించారు. కేంద్రం తరఫున నోటీసులను స్టాండింగ్ కౌన్సెల్ అనురాగ్ అహ్లూవాలియా స్వీకరించారు.