న్యూ డిల్లీ ఏప్రిల్ 8
కోవిడ్19 మహమ్మారి పుట్టుకపై మళ్లీ దర్యాప్తు చేపట్టాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు డిమాండ్ చేశారు. కోవిడ్ మూలాలకు సంబంధించి ఇటీవల డబ్ల్యూహెచ్‌వో ఓ నివేదికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వైరస్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని, అది జంతువుల నుంచి మనుషులకు పాకినట్లు ఆ రిపోర్ట్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం తేల్చింది. అయితే తాజాగా వివిధ దేశాలకు చెందిన 24 మంది శాస్త్రవేత్తలు ఓ బహిరంగ లేఖ రాశారు. యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఆ లేఖలో మళ్లీ కొత్తగా కోవిడ్ పుట్టుక గురించి విచారణ చేపట్టాలని కోరారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరడమంటే.. ఏదో ఒక దేశంపై వేలెత్తి చూపడం కాదు అని, అసలు ఈ మహమ్మారి ఎలా మొదలైంది, దాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమగ్రంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో శాస్త్రవేత్తలు తెలిపారు.24 మంది సైంటిస్టులు సంతకం చేసిన లేఖను ప్రఖ్యాత అమెరికా ఆంగ్ల పత్రిక ప్రచురించింది. అట్లాంటిక్ కౌన్సిల్ సైంటిస్టు జేమీ మెట్జల్ ఆ లేఖలో వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ మూలాల గురించి విస్తృత స్థాయిలో విచారణ చేపట్టాలని, దాని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగశాలల్లో జరుగుతున్న వైరస్ అధ్యయనాల గురించి సమగ్ర అవగాహన వస్తుందని, నియంత్రణ తెలుస్తుందన్నారు. తాము చేస్తున్న డిమాండ్.. చైనాకు వ్యతిరేకం కాదన్నారు. వైరస్ అధ్యయనాలకు సంబంధించి డేటాను షేర్ చేసుకోవాలన్న టెడ్రోస్ వాదనను ఇటీవల భారత్ సమర్థించింది. కానీ పూర్తి స్థాయి డేటా, శ్యాంపిళ్ల యాక్సెస్ కోసం చైనా అనుసరిస్తున్న వ్యూహాలను భారత్ ఖండించింది.