హైద్రాబాద్, ఏప్రిల్ 9,
కోవిడ్ ప్రభావం అన్ని రంగాలతో పాటు విద్యా రంగంపై కూడా భారీస్థాయిలోనే పడింది. గత ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ మధ్య వరకూ ఆన్ లైన్ క్లాస్ ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించిన అధికారులు.. ఇటీవలే స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభించిన విషయం తెలిసిందే.అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలో విద్యాసంస్థలు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులతో పాటు.. తల్లిదండ్రుల్లోనూ ఇంటర్ పరీక్షలు జరుగుతాయా..? జరగవా..? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్ బోర్డు స్పందించి పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేసింది.మే 1వ తేదీ నుంచి ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్–19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.ఇక ఏప్రిల్ 1, 3 వ తేదీల్లో విద్యార్థులకు నిర్వహించాల్సిన నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను అసైన్‌మెంట్ల రూపంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు ఈ పరీక్షలను ఇళ్ల దగ్గర నుంచి అసైన్‌మెంట్ల రూపంలో రాసి ఆయా కాలేజీల్లో సమర్పించే అవకాశం కల్పించింది. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను సైతం వాయిదా వేశారు.ఈ ప్రాక్టికల్ పరీక్షలు మే 29 నుంచి జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలపై సైతం సందేహాలు మొదలయ్యాయి. వార్షిక పరీక్షలు సైతం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అవి వాయిదా పడే అవకాశం మాత్రమే ఉంది. ఎందుకంటే.. ఈసారి పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్ చేసే ఆలోచన లేదని ఇటీవల ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది