వాషింగ్టన్ ఏప్రిల్ 9
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్ లోని బ్రయాన్‌లోని పారిశ్రామిక పార్కులోని క్యాబినెట్ తయారీ పరిశ్రమలో ఓ దుండగుడు గురువారం కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నిందితుడిని పట్టుకునే సమయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్‌పై సైతం కాల్పులు జరుపడంతో గాయాలయ్యాయి.కెంట్‌మూర్ క్యాబినెట్స్‌లో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ వారిని సెయింట్ జోసెఫ్ హెల్త్ రీజనల్ ఆసుపత్రికి తరలించినట్లు బ్రయాన్ పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి క్యాబినెట్ తయారీ ఉద్యోగి అని పోలీస్ చీఫ్ ఎరిక్ బుస్కే తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కాల్పుల ఘటనపై అధికారులకు సమాచారం వచ్చిందని, సంఘటనా స్థలంలో ఒక వ్యక్తి మరణించాడని, నలుగురిని హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు. గాయపడ్డ వారి పలువురి పరిస్థితి విషమంగా ఉందని, ఘటనలో మొత్తం ఏడుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు.