హైదరాబాద్
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సమానంగా అడవుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ వాక్సిన్ తీసుకోవాల్సిందిగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
అడవుల్లో విధులు నిర్వహిస్తూ అగ్నిప్రమాదాల నివారణ, వేట, స్మగ్లింగ్ కార్యకలాపాల నియంత్రణకు క్షేత్ర స్థాయి సిబ్బంది పాటు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ శాఖ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది. వారికి ప్రాధాన్యతగా కోవిద్ వాక్సిన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ జిల్లా వైద్య శాఖ అధికారులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
దీంతో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది వైద్య సిబ్బంది సహకారంతో వాక్సిన్ డోస్ లు తీసుకుంటున్నారు. అటవీ శాఖ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే అటవీ సంపదతో పాటు, వన్యప్రాణుల రక్షణకు వీలవుతుందని (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. క్షేత్రస్థాయిలో తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని విధులకు హాజరు కావలసిందిగా కోరారు. అటవీ సిబ్బందికి ఇస్తున్న వాక్సిన్ వివరాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పీసీసీఎఫ్ వెల్లడించారు. ఉన్నతాధికారుల చొరవను మంత్రి ప్రశంసించారు. క్షేత్ర స్థాయి సిబ్బందితోపాటు, వివిధ బేస్ క్యాంపుల్లో విధులు నిర్వహిస్తున్న వాచర్లకు కూడా వాక్సిన్ ఇప్పించాల్సిందిగా అన్ని జిల్లాల అటవీ అధికారులను మంత్రి కోరారు.
ఇటు అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ రోజూ రెండు సార్లు శానిటైజ్ చేయటంతోపాటు, సిబ్బంది తప్పని సరిగా మాస్క్, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. సందర్శకుల సంఖ్యను నియంత్రించారు.