న్యూఢిల్లీ ఏప్రిల్ 9
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు ఆన్‌లైన్‌లో పిటిషన్ పెట్టిన విషయం విదితమే. మే నెలలో నిర్వహించే పరీక్షలను రద్దు చేయాలి లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కోరుతూ లక్ష మంది విద్యార్థులు ఆ పిటిషన్‌పై సంతకాలు చేశారు.ఈ క్రమంలో సీబీఎస్ఈ విద్యార్థులకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారు. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం లేదా ఇతర మార్గాల్లో(ఆన్‌లైన్) పరీక్షలు నిర్వహించాలని ఆమె కోరారు. పరీక్షలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుందన్నారు.విద్యార్థుల నుంచి వస్తోన్న డిమాండ్‌పై సీబీఎస్‌ఈ అధికారులు స్పందించారు. పరీక్షల నిర్వహణలో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను పాటిస్తామని, ఇందులో భాగంగానే పరీక్ష కేంద్రాలను 40 నుంచి 50 శాతం మేర పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చిన్నారుల్లోనూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.షెడ్యూల్ ప్రకారమే వార్షిక పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సీబీఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ గెర్రీ అరాథూన్ కూడా స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దన్నారు. మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా, కరోనా కారణంగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి సీబీఎస్‌ఈ బోర్డ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా.? లేదా పరీక్షలు నిర్వహిస్తోందో చూడాలి.