న్యూఢిల్లీ ఏప్రిల్ 9
కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దేశంలో రైలు సర్వీసులు కొనసాగుతాయా..? ఆగిపోతాయా..? అన్న ప్రజల సందేహాలకు తెరదించుతూ రైల్వేబోర్డు కీలక ప్రకటన చేసింది. దేశంలో అవసరం మేరకు రైలు సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. రైళ్లకు కొరతేమీ లేదని, రైలు సర్వీసులను నిలిపివేయాలనే ఆలోచన కూడా రైల్వేబోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ వెల్లడించారు.వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్, మే నెలల్లో సర్వీసులను మరింత పెంచామని సునీత్ శర్మ తెలిపారు. గోరఖ్‌పూర్, పట్నా, దర్భంగా, వారణాసి, గువాహటి, బరౌనీ, ప్రయాగ్‌రాజ్, రాంచి, లక్నో తదితర నగరాల్లో ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో.. సెంట్రల్ రైల్వే పరిధిలో 58, వెస్టర్న్ రైల్వే పరిధిలో 60 సర్వీసులను అదనంగా కేటాయించినట్లు తెలిపారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,400 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 5,300 సబర్బన్ సర్వీసులు నడుస్తున్నాయని రైల్వే బోర్డు చైర్మన్ చెప్పారు. ఇప్పుడు దాదాపు 800 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, కరోనాకు ముందుతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే అయినా రాష్ట్రాల నిర్ణయాల మేరకు అవసరమైతే సర్వీసుల సంఖ్యను పెంచుతామని ఆయన తెలిపారు.