YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సాఫ్ట్ స్టోరీలో పవర్ ఫుల్ గా పవన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్

సాఫ్ట్ స్టోరీలో పవర్ ఫుల్ గా పవన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్

హైదరాబాద్, ఏప్రిల్ 9, 
ఒక సోల్ ఉన్న కథ ప్రేక్షకుడ్ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయదు. వకీల్ సాబ్ చిత్రం కూడా అలాంటిదే. తెరపై వాస్తవ జీవితాన్ని చూపించే చిత్రాలు అరుదుగా వస్తాయి. అనాదిగా స్త్రీ యొక్క ఆలోచనలను, హక్కులను, స్వేచ్ఛని అణిచివేస్తున్న అనేక అంశాల్ని నిక్కచ్చిగా కోర్టు బోనులో నిలబెట్టి మరీ నిగ్గుతేల్చాడు వకీల్ సాబ్. ఈ సినిమా కథ, విశ్లేషణకు వెళ్తే..సామాన్య మధ్యతరగతికి చెందిన ముగ్గురు అమ్మాయిలు నివేదా థామస్ (పల్లవి), అంజలి (జరీనా), అనన్య (దివ్య నాయక్) సిటీకి వచ్చి కుటుంబ బాధ్యతల్ని మోస్తుంటారు. లక్ష్మీ విహార్ కాలనీలో ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉంటుంటారు. ఓరోజు రాత్రి క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా.. ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) కొడుకు వంశీ తన స్నేహితులతో కలసి ఈ ముగ్గురుపై కన్నేస్తారు. వాళ్లని నమ్మించి ఓ రిసార్ట్‌కి తీసుకుని వెళ్లి బలవంతం చేయబోతారు. అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పల్లవి.. వంశీని మందు సీసాతో కొట్టి పారిపోతుంది.ఎంపీ రాజేంద్ర తన పలుకుబడి ఉపయోగించి ఈ ముగ్గురు యువతులపై రివర్స్ కేసు పెట్టిస్తారు. ప్రాసిక్యూషన్ లాయర్ నంద (ప్రకాష్ రాజ్) సాయంతో వీళ్లని వ్యభిచారులుగా చిత్రీకరిస్తారు.. పల్లవిని జైలుకు పంపుతారు. అయితే జరీనా, అనన్యలు బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో న్యాయం కోసం ఎదురుచూస్తుంటారు. ఈ తరుణంలో కేసు గెలవాలని కాకుండా న్యాయం గెలవాలని పోరాటం చేస్తూ.. నాలుగేళ్లు పాటు కోర్టు నుంచి సస్పెండ్ అయిన వకీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్‌)ని కలుస్తారు. ఈ వకీల్ సాబ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు? ఈ ముగ్గురు యువతుల్ని కేసు నుంచి ఎలా బయటపడేశాడు? అసలు నిందుతుల్ని చట్టానికి ఎలా పట్టించాడు? అసలు సత్యదేవ్ నేపథ్యం ఏంటి? తన భార్య శృతి హాసన్‌ని పోగొట్టుకుని తాగుబోతుగా ఎందుకు మారాడన్నది కథలో కీలక అంశాలు.సామాజిక అంశాలతో ప్రయోగాలు చేయడం తెలుగులో కాస్త అరుదే.. అయితే కమర్షియల్ అంశాలు, సక్సెస్ ఫార్ములాని బ్యాలెన్స్ చేస్తూ వకీల్ సాబ్ చిత్రంతో ధైర్యం చేశారు. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ యాక్టర్‌తో సాఫ్ట్ కథను డీల్ చేయడం అంటే కత్తి మీద సామే. కానీ పవన్ స్టామినాకి ఏమాత్రం తగ్గకుండా పాత్రని డిజైన్ చేశారు.వకీల్ సాబ్ టీజర్, ట్రైలర్ చూస్తే కథ ఏంటన్నది అర్థమైపోతుంది.. పైగా పింక్ రీమేక్ కాబట్టి చాలామందికి కథపై ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇలాంటి తెలిసిన కథను ఉత్కంఠగా నడిపించి కథలోకి ఆడియన్స్‌ని తీసుకుని రాగలిగితే సినిమా అద్భుతంగా ఆడుతుందనడానికి వకీల్ సాబ్‌ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.మెయిన్ కథను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా హీరో ఇమేజ్ తగ్గట్టుగా బ్యాలెన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. పింక్ రీమేక్ అంటే చాలా సున్నితమైన కథ.. ఇలాంటి కథకు పవర్ స్టార్ లాంటి పవర్ ఫుల్ యాక్టర్ అంటే హీరోయిజం పండదేమో అని చాలామందిలో సందేహం ఏర్పడింది. కథపై కసరత్తులు చేసి కథతో పాటుగా హీరోయిజాన్ని సమపాళ్లలో అందించారు దర్శకుడు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని ఎలా అయితే చూడాలని కోరుకుంటారో అలాగే చూపించారు. తెలిసిన కథే అయినా హీరో క్యారెక్టర్‌ని కొత్తగా చూపించారు. హిందీలో అమితాబ్.. తమిళ్‌లో అజిత్ పాత్రలకు భిన్నంగా వకీల్ సాబ్‌ని చూపించారు. వాళ్లకంటే బాగా చేశాడా?? క్యారెక్టర్ అక్కడ కంటే ఇక్కడ బాగా పేలిందా? అంటే దిల్ రాజు చెప్పినట్టుగా 50, 70, 100 అని మార్కులు ఇవ్వలేం కానీ.. వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ పూర్తి న్యాయం చేశారు.పవన్ కళ్యాణ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకుని ‘వకీల్ సాబ్‌’ని చూపించిన తీరు బావుంది. ముఖ్యంగా ఆయన స్టైల్ కొత్తగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్న స్టైలిష్ పాత్రల్లో ‘వకీల్ సాబ్’ ఒకటని చెప్పొచ్చు. ఇందులో డిఫరెంట్ మ్యానరిజమ్ కనిపిస్తుంది. అప్పటివరకూ అగ్గిలా రెచ్చిపోయే అతను.. చుక్క పడగానే చల్లబడిపోయే చమత్కారమైన పాత్రలో విలక్షణంగా కనిపిస్తారు.దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని కావడం వల్లనో.. లేక పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని ఫ్యాన్ బేస్‌ని రెట్టింపుచేయాలన్న ఉత్సాహమో తెలియదు కానీ.. సాఫ్ట్ స్టోరీలో పవన్ కళ్యాణ్‌ని పాత్రని చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశారు. కొన్ని కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడంతో పాటు.. దర్శకత్వ ప్రతిభను కూడా చూపించారేమో అనిపిస్తుంది. దర్శకుడు పవన్ కళ్యాణ్ ఇన్ పుట్స్ ఇచ్చారని ముందే చెప్పారు కానీ.. టేకింగ్‌లో పవన్ కళ్యాణ్ మార్క్ స్పష్ఠంగా తెలుస్తుంది.ఉమెన్ ఎంపవర్ మెంట్ అనేది ఈ చిత్రంలో మెయిన్ పాయింట్.. అయితే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో భాగంగా కోర్ పాయింట్‌ని వదిలేశారేమో అనిపిస్తుంటుంది. ఫిక్షన్.. లవ్.. ఫ్యామిలీ డ్రామా.. యాక్షన్ డ్రామా ఇలాంటి జానర్స్ చాలా సేఫ్ జానర్స్. వీటికి సెలక్టెడ్ ఆడియన్స్ ఉంటారు. కానీ కోర్టు డ్రామా అంటే బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. సన్నివేశంలో ఏ మాత్రం పస తగ్గినా నసగా అనిపించే ప్రమాదం ఉంది.. అయితే ఈ సినిమాలో కోర్టు డ్రామా ఉత్కంఠగా నటించింది. సెకండాఫ్ మొత్తం సింగిల్ వేవ్‌లో కోర్టు డ్రామాగా నడిపారు. వాదోపవాదాలతో ఉత్కంఠగా.. ఎమోషనల్ డ్రామాగా నడిపించిన తీరు బావుంది.అయితే ప్రాసిక్యూషన్ లాయర్ సాక్ష్యాధారాలతో పైచేయి సాధిస్తే.. డిఫెన్స్ లాయర్ ప్రవచనాలు సూక్తులకు పరిమితం అయినట్టుగా అనిపిస్తుంది. కేసుని గెలవడానికి కీ పాయింట్ కానీ.. కీలకమైన ఆధారం కానీ చూపించి ఉంటే లెంగ్తీ కోర్టు డ్రామాకి పూర్తి న్యాయం జరిగేది. లాయర్ సాబ్ ఏం పాయింట్ లాగాడురా.. అని ప్రేక్షకులు చప్పట్లు కొట్టే సీన్ లేకపోవడం క్లైమాక్స్ కాస్త చప్పగానే ముగించినట్టు అనిపిస్తుంది.అసలు వకీల్ సాబ్ ఎవరు? ఈ కథకి అతనికి సంబంధం ఏంటి? అనే హుక్ పాయింట్‌తో నడిపిన విధానం ఆకట్టుకుంది. కథని నడిపించడానికి సాధనంగా వాడుకున్న ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్ పాత్ర.. ఆ కథలో ఉన్న సోల్‌ని డ్యామినేట్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. దీనిలో భాగంగా వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా చాలా పెయిన్ ఫుల్‌గా అనిపిస్తుంది. శృతి హాసన్‌తో లవ్ ట్రాక్.. ఆమెతో పెళ్లి.. కడుపులో బిడ్డతోనే చనిపోవడం లాంటి సీన్లతో వీరి ప్రేమ కథకు విషాదంతో కూడిన ముగింపు ఇచ్చి ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు. శృతి హాసన్‌ కనిపించేది కాసేపైనా ఆమె పాత్రకు ప్రాధాన్యత కల్పించారు.దర్శకుడు చెప్పినట్టు భారతదేశంలో ప్రతి వంద కిలోమీటర్లకు ప్రతిదీ మారిపోతుంది.. ఈ రీమేక్ సినిమా కూడా అంతే. హిందీ పింక్ తమిళ్‌కి వెళ్లేసరికి మారిపోయింది.. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ స్టామినాకి తగ్గట్టుగా.పసలేకపోతే కమర్షియల్ అంశాలపై ఆధారపడి.. ఎక్స్ ట్రా హంగులు అద్దాలి కానీ.. సోల్ ఉన్న కథలో క్యారెక్టర్స్ పవర్ ఫుల్‌గానే అనిపిస్తాయి. లిమిటెడ్ పవర్ క్యాస్టింగ్‌లో సీన్లు అద్భుతంగా పండేట్టు చేశారు. ఈ సినిమాలోని ఇతర పాత్రల గురించి చెప్పాలంటే.. కోర్టు డ్రామా సీన్లలో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్‌తో పోటీ పడి నటించారు. కోర్టు వాదనల్లో భాగంగా ప్రకాష్ రాజ్.. నివేదా థామస్‌ని ఉద్దేశించి ఓ మాట అంటారు.. యువర్ ఆనర్ ఈమె కోర్టులో నటించమంటే ఏకంగా జీవించేస్తుంది అని.. నిజంగానే పల్లవి పాత్రలో జీవించేసింది నివేదా. నువ్ వర్జిన్‌వా తండ్రి ముందు పదే పదే ఓ లాయర్ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో సిగ్గు విడిచి తన వర్జినిటీ గురించి చెప్పి కోర్టు బోనులో కూలబడిపోయే సీన్‌లో కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది నివేథా. ఇక ముస్లిం యువతి జరీనాగా అంజలి కూడా జీవించేసింది. చేయని తప్పుని ఒప్పుకుంటూ కోర్టులో కూలబడిపోయే సీన్‌లో భావోద్వేగాన్ని పండించింది. దివ్య నాయక్ పాత్రలో అనన్య చాలా అమాయకంగా నటించి మెప్పించింది.పవన్ కళ్యాణ్ అభిమానుల వరకూ ఓకే కానీ.. ఇందులో పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు రాసిన డైలాగ్‌ అతని పొలిటికల్ ఎజెండాకు అనుగుణంగా రాసినట్టు అనిపిస్తాయి. అతని ఓటమి గురించి పదే పదే చెప్పడం కూడా కథకు కన్వే అయినట్టు అనిపించదు. ఓటమి అంటే అవమానం కాదు.. మనల్ని మనం గెలిచే అవకాశం.. నాకు గెలుపు ఓటమిలతో పనిలేదు.. నా మనసేంటో మీకు తెలుసు.. మీ బాధలేంటే నాకు బాగా తెలుసు. మీరు నేను వేరు వేరు కాదు.. మనమంతా ఒక్కటే.. మనమంతా కలిసి పోరాడదాం’ అంటూ పవన్ కళ్యాణ్ సినిమా క్లైమాక్స్‌లో ఇచ్చే స్పీచ్.. ఆయన పొలిటికల్ జర్నీకి అడాప్ట్ చేసుకున్నట్టుగానే అనిపిస్తాయి.సామాన్యుడు పెడతానంటే ఆశపడతాడు.. బెదిరిస్తే భయపడతాడు.. ఆశకి భయానికి మధ్య ఊగిసలాగే జీవితాలు వాళ్లవి. వాళ్లు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడూ వాళ్లకి అండగానే ఉంటా. ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా నాలో ఆవేశం తగ్గదు.. ఆశయం మారదు.. లాంటి డైలాగ్‌కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విజిల్స్ కొట్టిన కామన్ ఆడియన్స్‌ని మాత్రం ఆలోచనలో పడేసేట్టుగానే ఉన్నాయి.

Related Posts